అమెరికాకు తగ్గుతున్న వలసలు.. లాభమా..నష్టమా?
ప్రపంచంలో అగ్ర రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా భవిష్యత్ లో సవాళ్లు ఎదుర్కొక తప్పదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
By: Tupaki Desk | 23 Aug 2025 1:53 PM ISTప్రపంచంలో అగ్ర రాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా భవిష్యత్ లో సవాళ్లు ఎదుర్కొక తప్పదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలేనని స్పష్టమవుతున్నది. అయితే ఈ నిర్ణయాలు అమెరికా భవిష్యత్ కు లాభమా..నష్టమా అనే చర్చలు జరుగతున్నాయి.
అమెరికాలో వలసదారుల సంఖ్య గత ఆరు దశాబ్దాల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలస విధానాల్లో కఠినత పెరగడం, మాస్ డిపోర్టేషన్లు, అరెస్టులు, చట్టబద్ధ ప్రవేశాలపై కొత్త ఆంక్షలు విధించడం వంటి చర్యలు ఈ పరిణామానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వలస జనాభాలో భారీ తగ్గుదల
ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో సుమారు 15 లక్షల వలసదారులు తగ్గిపోయారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న ఇమిగ్రెంట్స్ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలాంటి తగ్గుదల తొలిసారిగా నమోదవడం విశేషం.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్యూ రీసెర్చ్ సెంటర్ డెమోగ్రాఫర్ జెఫ్రె పస్సెల్ ప్రకారం, అమెరికా జనాభాలో పనిచేయగల వయసులోని వ్యక్తుల పెరుగుదల స్థిరంగా లేకపోవడం వల్ల, వలసలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలుస్తాయి. అయితే వలసల సంఖ్య తగ్గిపోవడం వల్ల కార్మిక శక్తి లోటు ఏర్పడి, ఆర్థిక ప్రగతి మందగించే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ ప్రభావం, బైడెన్ చర్యలు
సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించేందుకు బైడెన్ గత ప్రభుత్వమూ చర్యలు తీసుకున్నది. కానీ ట్రంప్ కఠిన విధానాలు ఈ మార్పునకు పెద్ద కారణమని నివేదిక పేర్కొంది. మాస్ డిపోర్టేషన్ చర్యలు, దేశ బహిష్కరణ నుండి రక్షించే నిబంధనలను రద్దు చేయడం వంటి నిర్ణయాల వల్ల అనధికార వలసలు కూడా గణనీయంగా తగ్గాయి.
భవిష్యత్ సవాళ్లు
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వలసలు తగ్గడం అమెరికాకు ద్వంద్వ సమస్యను తెచ్చిపెట్టనుంది. ఒకవైపు కార్మిక శక్తి లోటు, మరోవైపు ఆర్థిక వృద్ధి మందగింపు. వలసలే అమెరికా శ్రామికశక్తికి వెన్నెముకగా నిలుస్తాయని, వాటి లేకపోతే పరిశ్రమలు, సేవా రంగం ఎదురుదెబ్బ తినే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
