Begin typing your search above and press return to search.

అంబేద్కర్ జయంతి ప్రత్యేకం: రాజ్యాంగ నిర్మాతలోని అపర చాణక్యుడు!

బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ గొప్ప మేధావి. భారత రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప సామాజిక సంస్కర్తగా, న్యాయనిపుణుడిగా ఆయన చిరస్మరణీయులు.

By:  Tupaki Political Desk   |   14 April 2026 3:10 PM IST
అంబేద్కర్ జయంతి ప్రత్యేకం: రాజ్యాంగ నిర్మాతలోని అపర చాణక్యుడు!
X

బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ గొప్ప మేధావి. భారత రాజ్యాంగ నిర్మాతగా, గొప్ప సామాజిక సంస్కర్తగా, న్యాయనిపుణుడిగా ఆయన చిరస్మరణీయులు. అంటరానితనాన్ని రూపుమాపడానికి, దళితులు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన అంబేద్కర్ గొప్ప ఆర్థిక వేత్త. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం అంబేద్కర్ రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం భారత్, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడిందని చెబుతారు. దేశంలో రిజర్వు బ్యాంకు ఏర్పాటుకూ ఆ పుస్తకమే ప్రేరణగా నిలిచిందని చరిత్ర చెబుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి

అంబేద్కర్ అనగానే భారత రాజ్యాంగ నిర్మాతగా స్మరణకు వస్తారు. కానీ, ఆయన కేవలం ఒక చట్ట సభల మేధావి మాత్రమే కాదు, ఆధునిక భారతదేశ ఆర్థిక పునాదులను నిర్మించిన గొప్ప దార్శనికుడుగా కీర్తి గడించారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం ఆయన చేసిన కృషిని ఆ మహనీయుడి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత. అంబేద్కర్ కేవలం రాజకీయ వేత్తగానే కాకుండా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

బ్రిటిష్ పాలనలో భారత కరెన్సీ విలువను ఎలా తగ్గించి, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారో ఆయన గణాంకాలతో సహా నిరూపించారు. ఆ పుస్తకంలో ఆయన సూచించిన మార్గదర్శకాల ఆధారంగానే, 1935లో భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. 'హిల్టన్ యంగ్ కమిషన్' ముందు అంబేద్కర్ ఇచ్చిన సాక్ష్యం, ఆయన ఆర్థిక విశ్లేషణే మన బ్యాంకింగ్ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీపై పోరాటం

బ్రిటిష్ వారు భారతదేశాన్ని కేవలం పరిపాలించడమే కాకుండా, పక్కా ప్రణాళికతో ఆర్థికంగా ఎలా కొల్లగొట్టారో అంబేద్కర్ తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. ముఖ్యంగా పన్నుల భారం మోపి సామాన్యులను కొల్లగొట్టారు. దేశ సంపదను బ్రిటన్‌కు తరలించారు. ఈ దోపిడీని అంబేద్కర్ పక్కా లెక్కలతో ఎండగట్టారు. భారతీయులను కేవలం ముడి సరుకులు సరఫరా చేసే కూలీలుగా మార్చిన బ్రిటిష్ ఆర్థిక విధానాలను విశ్లేషించి, స్వయం సమృద్ధి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

సామాజిక న్యాయంతో ముడిపడిన ఆర్థిక వ్యవస్థ

అంబేద్కర్ దృష్టిలో ఆర్థికాభివృద్ధి అంటే కేవలం అంకెలు పెరగడం కాదు. అది సామాజిక సమానత్వానికి దారితీయాలి. అందుకే వ్యవసాయ సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. చిన్న భూకమతాల వల్ల కలిగే నష్టాలను వివరించి, సామూహిక సేద్యం వైపు మొగ్గు చూపాలని సూచించారు. జల వనరుల పక్కా నిర్వహణతో దేశంలో నదీ జలాల వినియోగం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని హితబోధ చేశారు. 'సెంట్రల్ వాటర్ కమిషన్' ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర మరువలేనిదిగా చెబుతారు.

విద్యావేత్తగా మేధో మథనం

"బోధించు, సమీకరించు, పోరాడు" అనే నినాదంతో విద్యను ఒక సామాజిక ఆయుధంగా అంబేద్కర్ మార్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రపంచంలోనే అత్యున్నత విద్యను అభ్యసించిన ఆయన, అణగారిన వర్గాల ఆర్థిక విముక్తికి 'విద్య' ఒక్కటే మార్గమని నమ్మారు. అందుకే ఆయన స్థాపించిన విద్యా సంస్థలు నేటికీ లక్షలాది మందికి జ్ఞాన జ్యోతులను పంచుతున్నాయి. రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించిన అంబేద్కర్, తన ఆర్థిక సూత్రాల ద్వారా దేశానికి భద్రతను ఇచ్చారు. ఆయన రాసిన 'ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ' నేటికీ విద్యార్థులకు ఒక ప్రామాణిక గ్రంథం. కుల నిర్మూలన, సామాజిక సమానత్వంతో పాటు, ఆర్థిక స్వేచ్ఛ ఉంటేనే భారతదేశం ప్రపంచ దేశాల సరసన నిలబడగలదని అంబేద్కర్ ఆకాంక్షించారు.