Begin typing your search above and press return to search.

వైసీపీకి అంబటి రాయుడు బిగ్‌ షాక్‌!

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 5:43 AM GMT
వైసీపీకి అంబటి రాయుడు బిగ్‌ షాక్‌!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ క్రికెటర్, కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీలో చేరారు. ఇంతలోనే ఆ పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.


ఈ మేరకు అంబటి రాయుడు తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. త్వరలోనే తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

కాగా ఇటీవల కాలంలో కాపు సామాజికవర్గానికి చెందినవారి పై వైసీపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితమే అంబటి రాయుడును సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనను గుంటూరు లోక్‌ సభ నియోజకవర్గం లేదా పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని టాక్‌ నడిచింది.

ఇందుకు తగ్గట్టే అంబటి రాయుడు కూడా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మేడికొండూరు, తెనాలి, ఫిరంగిఫురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ స్కూల్‌ పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. రైతు భరోసా కేంద్రాలను పరిశీలించి వాటి పనితీరును మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని ప్రశంసించారు.

గతంలోనూ అంటే వైసీపీలో చేరకముందు కూడా అంబటి రాయుడు సోషల్‌ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పలు పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడును వైసీపీలోకి ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

గతంలో ఐపీఎల్‌ లో అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ తదితర జట్ల తరఫున ఆడారు. అంతేకాకుండా భారత క్రికెట్‌ టీమ్‌ లోనూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల ఆయన అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించారు.

అంబటి రాయుడు రాజీనామాకు రెండు కార ణాలు ఉన్నాయని అంటున్నారు. గుంటూరు ఎంపీ సీటును ఈసారి నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇస్తారని సమాచారం. అలాగే పొన్నూరు అసెంబ్లీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్య మరోసారి పోటీ చేస్తారని చెబుతున్నారు. గుంటూరు ఎంపీ సీటును కృష్ణదేవరాయలకు, పొన్నూరు సీటును కిలారికి కేటాయించడంతోనే అంబటి రాయుడు అసంతృప్తి చెందారని టాక్‌. ఈ నేపథ్యంలోనే వైసీపీకి రాజీనామా ప్రకటించారని చెబుతున్నారు.