Begin typing your search above and press return to search.

ఏపీ కుల రాజకీయాలపై "యువ అంబటి" సంచలన వ్యాఖ్యలు

మరో ప్రధాన సామాజిక వర్గం కూడా ఇంకో పార్టీ వెంట నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్, ఏపీ నేపథ్యం ఉన్న అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 2:59 PM GMT
ఏపీ కుల రాజకీయాలపై యువ అంబటి సంచలన వ్యాఖ్యలు
X

ఎవరు ఎంత చెప్పినా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులం చుట్టూనే తిరుగుతుంటాయి. ఆఖరికి కులం భావన లేనివారికి కూడా దానిని అంటించడం అక్కడి రాజకీయాలకు మాత్రమే సాధ్యం. పరిచయమైన మరుక్షణమే "మీరు ఏంటోళ్లు" అని ఏపీ ప్రజలు అడుగుతారనే పేరుంది. ప్రజలే అలా ఉంటే.. ఇక రాజకీయాల గురించి చెప్పేదేముంది? మరోవైపు రెండు ప్రధాన సామాజిక వర్గాల ప్రజలు రెండు ప్రధాన పార్టీల పక్షం వహిస్తున్న సీన్ ఏపీలో కనిపిస్తుంది. మరో ప్రధాన సామాజిక వర్గం కూడా ఇంకో పార్టీ వెంట నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెటర్, ఏపీ నేపథ్యం ఉన్న అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు.

అతడు క్లోజ్ ఫ్రెండే.. ఓటేయడు

రాయుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు 9 నెలల నుంచి చర్చ సాగుతోంది. అతడు ఏ పార్టీలో చేరేదీ నోటి నుంచి చెప్పలేదు. మధ్యలో కొన్ని రోజులు ఆయన కామ్ గా ఉన్నారు. కానీ, ఇప్పుడు రాయుడు వెళ్లేది వైఎస్సార్సీపీ లోకే అని తన ఉద్దేశాలను బట్టి తెలుస్తోంది. గతంలో ఏపీ సీఎం జగన్ ను కలిసిన ఉదంతాలను గుర్తుచేస్తున్నారు. గుంటూరు నుంచి ఎంపీగా రాయుడు పోటీ చేయనున్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాయుడు ఏపీ కుల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 30 ఏళ్ల నుంచి తనకు అత్యంత బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడని.. అతడు తన కోసం ప్రాణం ఇస్తాడని.. కానీ ఓటు మాత్రం వేయడని.. దీనికి కారణం అతడిది 'ఆ క్యాస్టే'నని పేర్కొన్నాడు. కులాల వారీగా జనం ఎలా చీలిపోయారో చెప్పేందుకు రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు.

పదువుల కోసం కాదు.. మంచి చేసేందుకే..

ప్రజలకు మంచి చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు వివరించాడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనే తపన ఉందన్నాడు. తనను జనం నమ్ముతారని చెప్పిన రాయుడు.. అదే ఇంటర్వ్యూలో ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయానికి రాలేదన్నారు. జగన్ పార్టీ సిద్ధాంతాలు ఇష్టమని చెబుతూ పరోక్షంగా వైసీపీ వైపే మొగ్గాడు.

కులాలు, మతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కులాల వారీగా సమాజానిన విడగొట్టడం ఇష్టం లేదన్న కుండబద్దలు కొట్టాడు. వైసీపీ అందరినీ ఒకేలా చూస్తుందని.. జగన్ సర్కారు స్కూల్స్ ,స్పోర్ట్స్ లో చాలా మంచి మార్పులు తెచ్చిందని కొనియాడాడు. తన తాత టీడీపీ తరఫున సర్పంచ్ గా పోటీచేశారన్న వాదనను రాయుడు ఖండించాడు. టీడీపీ పుట్టక ముందే తన తాత అసెంబ్లీకి స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేశారని వివరించాడు

టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌, టీడీపీ అధినేత చంద్రబాబుది ఒకటే క్యాస్ట్ కావడం.,. వారికి వ్యతిరేకంగానే వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నానన్న ప్రచారాన్ని రాయుడు ఖండించాడు. కులాల కుమ్ములాటలు ఏపీ సమస్య అని.. దీనిని అధిగమించాలని పిలుపునిచ్చాడు. "అసెంబ్లీకా? పార్లమెంటుకా? అని కాదు..ప్రజల్లోకి వెళ్లాలనుంది. దీనికోసం ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నా" అని తెలిపాడు. జగన్ కు తనపట్ల మంచి అభిప్రాయం ఉందని రాయుడు వివరించాడు.