Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని అమరావతే.. వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి తాము అనుకూలమే అని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Feb 2024 9:00 AM GMT
ఏపీ రాజధాని అమరావతే.. వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
X

2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిగా అమరావతికి తాము అనుకూలమే అని వైసీపీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ప్లేటు ఫిరాయించింది. ఇందులో భాగంగా విశాఖపట్నాన్ని కార్వనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలు చెల్లవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాజధాని అమరావతిపై తరచూ వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అది ఒక కులానికి మాత్రమే రాజధాని అని.. అమరావతి కాదు.. భ్రమరావతి అని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మాత్రమే రాజధాని అని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి వైసీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని ఆయన స్పష్టం చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. కోర్టులో స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

వాస్తవానికి అమరావతిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తున్నవారిలో మొదటి నుంచి అంబటి రాంబాబు కూడా ఉంటున్నారు. అలాంటి అంబటే ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని చెప్పడం హాట్‌ టాపిక్‌ గా మారింది. అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం.. రాజధాని అమరావతి ఉన్న తాడికొండ నియోజకవర్గానికి పక్కనే ఉంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంత ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండేందుకే అంబటి ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. వాస్తవానికి రాజధానిని లేకుండా చేసిన వైసీపీ నేతలకు ఈసారి ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంబటి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా టీడీపీ – జనసేన పొత్తులపైనా అంబటి రాంబాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లది అపవిత్ర పొత్తు అని మండిపడ్డారు. ప్రతిపక్షాల్లో గందరగోళ పరిస్థితి ఉందన్నారు. జనసేన పార్టీ పొత్తు టీడీపీతోనా, బీజేపీతోనా అని ప్రశ్నించారు.