Begin typing your search above and press return to search.

బాలయ్యకు ఓదార్పు లేదా...?

ఓదార్పు యాత్ర చేపడతాను అని మొదట బాలయ్య ప్రకటిస్తే ఇపుడు భువనేశ్వరిని వెళ్లమనడం ద్వారా బాలయ్యకు చెక్ చెప్పేశారు అని మంత్రి గారు సెటైర్లు వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:08 PM GMT
బాలయ్యకు ఓదార్పు లేదా...?
X

నందమూరి వారసుడు బాలక్రిష్ణ సినిమాల్లో నట సింహం గా పేరు గడించారు. రాజకీయాల్లో మాత్రం తన తండ్రి పార్టీలో జస్ట్ ఎమ్మెల్యేగానే ఉంటున్నారు. హిందూపురం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి అయితే దక్కలేదు. ఆ తరువాత మూడేళ్ళకు చట్ట సభలలో ఎక్కడా ఎలెక్ట్ కానీ లోకేష్ ని మంత్రిని చేస్ది అయిదు కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు.

అయినా బాలయ్య సర్లే అల్లుడే మేనల్లుడు అని సర్దుకున్నారు. ఇక 2019లో టీడీపీ ఓటమి పాలు అయింది. ఆ తరువాత బాలయ్య రాజకీయంగా కొంత యాక్టివ్ అయ్యారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని ఆయన గట్టిగా పూనుకుంటున్నారు. తన బావ చంద్రబాబు సీఎం కావాల్సిందే అని కూడా పట్టుబడుతున్నారు. చంద్రబాబు అనూహ్యంగా అరెస్ట్ అయి జైలు పాలు కావడంతో బాలయ్య తాను పార్టీ భారం మోయడానికి సిద్ధం అని తన మాటల ద్వారా ప్రకటించేశారు.

బాబు జైలు జీవితాన్ని చూసి చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని బాలయ్య మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరిగిన రెండు రోజులకు పవన్ తో పొత్తు అని అనౌన్స్ చేయించడం ద్వారా చంద్రబాబు కొత్త వ్యూహాన్నే జైలు గోడల నుంచి రచించారు అని అర్ధం అయింది అంటున్నారు.

మరో వైపు చూస్తే లోకేష్ తో పాటు బాలయ్యను మెంబర్స్ గా చేసి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇపుడు అది కాస్తా ముందుకెళ్ళి ఏకంగా లోకేష్ అధ్యక్షతన టీడీపీ మీట్ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంటే బాబు జైలు జీవితాన్ని తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించేందుకు నారా భువనేశ్వరి వచ్చే వారం నుంచి ఏపీ అంతటా పర్యటించనున్నారు. బాబు తో ములాఖత్ కాగానే టీడీపీ నుంచి వెలువడిన ప్రకటన ఇది.

అంటే ఓదార్పు యాత్రలు అన్నీ భూవనేశ్వరి చూసుకుంటారు అన్న మాట. పార్టీ వ్యవహారాలు అన్నీ లోకేష్ బాబు చూసుకుంటూ బాబు నంద్యాలలో మధ్యలో ఆపేసిన మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడతారు అని కూడా డిసైడ్ చేశారు. ఇలా కనుక చూసుకుంటే టీడీపీలో బాబు తరువాత బాబు లేని టైం లో తల్లీ కొడుకులే ముందుండాలని బాబు డిసైడ్ చేసినట్లుగా అర్ధం అవుతోంది.

దీని మీద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జైలు గోడల మధ్య నుంచే చంద్రబాబు నందమూరి కుటుంబం చేతిలోకి పార్టీ పోకుండా కుట్రలు చేస్తున్నారు అని కామెంట్స్ చేసారు. ఓదార్పు యాత్ర చేపడతాను అని మొదట బాలయ్య ప్రకటిస్తే ఇపుడు భువనేశ్వరిని వెళ్లమనడం ద్వారా బాలయ్యకు చెక్ చెప్పేశారు అని మంత్రి గారు సెటైర్లు వేస్తున్నారు.

ఆయన అన్నారని కాదు కానీ టీడీపీలో బాలయ్య ప్లేస్ ఏంటి అన్నది నందమూరి ఫ్యాన్స్ కి కూడా డౌట్ గా ఉంది అని అంటున్నారు. బహుశా ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగిన మీదటనే బాలయ్య తన సినిమాలతో తాను బిజీగా ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి బాలయ్యకు టీడీపీలో ఓదార్పు లేదా అన్న చర్చ అయితే నడుస్తోంది అంటున్నారు.