Begin typing your search above and press return to search.

ఒక్క మాట.. 52 కేసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసు షాక్

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసు కేసులు వెంటాడుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   9 Feb 2026 3:22 PM IST
ఒక్క మాట.. 52 కేసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసు షాక్
X

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఆయనపై నమోదవుతున్న కేసులు, కోర్టులో దాఖలు చేస్తున్న పీటీ వారెంట్లను పరిశీలిస్తే మాజీ మంత్రి ఇప్పట్లో జైలు నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 52 కేసులు నమోదయ్యాయి. జనవరి 31న గుంటూరు నగరంలోని చిల్లీస్ సెంటర్ లో జరిగిన గొడవలో సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అదే రోజు రాత్రి అంబటిని అరెస్టు చేసి నల్లపాడు పోలీసుస్టేషన్ కు తరలించారు. ఆ మరునాడు కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేయిస్తోంది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు పోలీసులు ఇదే ఆరోపణలపై అరెస్టు చేయగా, రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు బాపట్లతో సహా పలు పోలీసుస్టేషన్ లో ప్రతి రోజూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రాంబాబుపై ప్రస్తుతం నమోదైన కేసుల సంఖ్య ఆఫ్ సెంచరీ దాటడాన్ని విపక్షం వైసీపీ తీవ్రంగా తప్పుపడుతోంది. తమ పార్టీ నేతను వేధించాలనే ఏకైక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మాజీ మంత్రి అంబటిపై నమోదు అవుతున్న కేసులు, ఇప్పటికే పెండింగులో ఉన్న కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేయడం చూస్తుంటే మాజీ మంత్రిని ఇప్పట్లో జైలు నుంచి విడుదల చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇంతకు ముందు అరెస్టు అయిన వైసీపీ నేతలు, సానుభూతిపరుల మాదిరిగానే మాజీ మంత్రి అంబటి రాంబాబును సైతం రాష్ట్రంలో వివిధ పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పాలని ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబుపై ప్రస్తుతం 3 పీటీ వారెంట్లు జారీ అయ్యాయని అంటున్నారు. మరిన్ని పీటీ వారెంట్లు దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తోందని అనుమానిస్తున్నారు.

మరోవైపు అంబటికి రాజమండ్రి జైలులో సరైన భద్రత లేదని వైసీపీ ఆందోళన చేస్తోంది. ఈ విషయమై హైకోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. కాగా, సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండులో ఉన్న అంబటిని సోమవారం పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంటుపై గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. గత ఏడాది నవంబరు 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంబటి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు గుంటూరులో ఆందోళన చేశారు. ఆ సమయంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుతో అంబటికి వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. దీనిపై పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తాజాగా పీటీ వారెంటు తీసుకుని అంబటిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

అంబటిపై ప్రభుత్వం తరఫున వరుస కేసులు నమోదు అవుతుండగా, ఆయన న్యాయవాదులు ఆ కేసులను కొట్టివేయాలని హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు 7 కేసులను క్వాష్ చేయాలని అంబటి తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరంపాలెం, నల్లపాడు, మంగళగిరి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అక్రమంగా కేసులు పెట్టారని, రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 5, 2026న విచారణ జరిగింది. కోర్టు ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఇదే సమయంలో జైలులో సౌకర్యాలు, కస్టడీ, బెయిల్ వంటి అంశాలపై గుంటూరులోని స్థానిక కోర్టులో కూడా విచారణ కొనసాగుతోంది.