Begin typing your search above and press return to search.

'రెడ్ బుక్'పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. మంత్రి లోకేశ్ కు గట్టి సవాల్

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న ‘రెడ్ బుక్’పై సోమవారం తీవ్రంగా స్పందించారు.

By:  Tupaki Desk   |   26 Jan 2026 11:52 PM IST
రెడ్ బుక్పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. మంత్రి లోకేశ్ కు గట్టి సవాల్
X

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న ‘రెడ్ బుక్’పై సోమవారం తీవ్రంగా స్పందించారు. వైసీపీ శ్రేణులను బయటపెట్టాలని రెడ్ బుక్ తో బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అంబటి.. రెడ్ బుక్ కు తన కుక్క కూడా భయపడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వెంట నడిచిన వారమని, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారమని చెప్పిన మాజీ మంత్రి అంబటి ‘రెడ్ బుక్’తో తమను భయపెట్టలేరని తెగేసి చెప్పారు.

గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కారణమైన రెడ్ బుక్ పై ఇప్పటికీ హాట్ టాపిక్ కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీ నేతలను వేధించిన పేర్లు ఎర్ర పుస్తకంలో రాస్తున్నానని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని టీడీపీ యువనేత నారా లోకేశ్ తన పాదయాత్రలో ప్రకటించారు. అలా ఆయన ప్రకటించిన విధంగానే అధికారంలోకి రాగానే ఎర్రపుస్తకంలో పేర్లు రాసిన వారిపై చర్యలు ప్రారంభమయ్యాయని పలుమార్లు చెప్పారు. ఇక విపక్షం కూడా రెడ్ బుక్ పేరుతో తమను వేధిస్తున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వంపై పోరాటానికి వైసీపీ కేడర్ వెనక్కు తగ్గుతోందని అంటున్నారు. అరెస్టు భయంతో కార్యకర్తలు, నేతలు సైతం పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ అధిష్టానం రెడ్ బుక్ పై తన స్టాండ్ మార్చుకున్నట్లు మాజీ మంత్రి అంబటి మాటలను బట్టి అర్థం అవుతోందని అంటున్నారు. తాము రెడ్ బుక్ ను లెక్క చేయడం లేదని చాటిచెప్పడం ద్వారా మంత్రి లోకేశ్ బెదిరింపులను తేలికగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దీనివల్ల వైసీపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

రెడ్ బుక్ పై వైసీపీ అధిష్టానం వైఖరి మార్చుకోవడం వల్లే రెడ్ బుక్ అంటే తమకు భయం లేదని అంబటి వ్యాఖ్యానించినట్లుగా చూస్తున్నారు. రెడ్ బుక్ లో తన పేరు ఉందని చెబుతున్న ఆ పెద్ద మనిషి ఏం చేయగలరని ప్రశ్నించారు అంబటి. రెడ్ బుక్ లో చాలా పేర్లు ఉన్నాయని అంటున్నారని, అయితే తాము అలాంటి రెడ్ బుక్, పిచ్చి బుక్కులకు భయపడే వారు కాదని వ్యాఖ్యానించి వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు అంబటి. మరోవైపు రెడ్ బుక్ అంటూ ఎన్నికల ముందు హడావుడి చేసిన మంత్రి లోకేశ్ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంబటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.