అంబటి విడుదల వేళ.. ఆ మాత్రం ఉండొద్దా ఏంటి?
కేసు ఏదైతేనేం.. జైల్లో ఉన్న నేతలకు బెయిల్ వచ్చిన తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లే ముందు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.
By: Garuda Media | 20 Feb 2026 11:37 AM ISTకేసు ఏదైతేనేం.. జైల్లో ఉన్న నేతలకు బెయిల్ వచ్చిన తర్వాత.. తిరిగి ఇంటికి వెళ్లే ముందు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి తీరునే ప్రదర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన చేసిన మోసాలపై ఫిర్యాదులు అందిన పోలీసులు కేసు నమోదు చేయటం.. అరెస్టు చేయటం తెలిసిందే. దీంతో ఆయన రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. కోర్టు నుంచి బెయిల్ ఆదేశాలు రావటంతో బుధవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజమహేంద్రవరంలోని జక్కంపూడి గణేశ్ ఇంట్లో బస చేశారు.
గురువారం ఉదయం గుంటూరుకు బయలుదేరిన ఆయన.. భారీ ఎత్తున కార్లు.. బైక్ ర్యాలీని చేపట్టారు ఆయన అభిమానులు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సెక్షన్ 30 అమల్లో ఉండగా ర్యాలీలు చేయొద్దని.. నాలుగైదు కార్లలో వెళ్లిపోవాలని సూచన చేసిన అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు పోలీసులు నోటీసులు అందజేశారు. దీనిపై ఆవేశానికి గురైన ఆయన.. ఇలా తనను అడ్డుకుంటే తాను పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. చివరకు పోలీసులతో జరిగిన చర్చలతో నాలుగైదు కార్లతో బయలుదేరి.. తర్వాత 20 కార్లతో ర్యాలీని కొనసాగించారు.
రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు వస్తున్న అంబటి రాంబాబును కాజా టోల్ ప్లాజా వద్దకు అంబటి అభిమానులు ఎదురెళ్లారు. పెద్ద ఎత్తున వాహనాల కాన్వాయ్ తో బయలుదేరారు. దీంతో హైవే మీద పెద్ద ఎత్తున వాహనాలు ఆగిపోవటంతో మంగళగిరి రూరల్ ఎస్ఐ వచ్చి.. వాహనాల్ని పక్కన నిలపాలని చెప్పగా.. అంబటి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నీ అంతు చూస్తా.. మా వాహనాల్నే ఆపుతావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ఆయన ర్యాలీ మొదలైంది. కొంత దూరం తర్వాత మంగళగిరి గ్రామీణ సీఐ ఏవీ బ్రహ్మం అంబటి వాహన కాన్వాయ్ తో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
దీంతో మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రాంబాబు.. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే కూర్చుంటా. చేతనైంది చేసుకో అంటూ సీరియస్ అయ్యారు. ఆటో నగర్ వద్ద పెద్దకాకాని సీఐ మీదా చిందులు వేశారు. ఆవేశం వద్దు.. పర్సనల్ గా తీసుకోకు అంటూ సూక్తులు వల్లించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగొద్దనే తన ఉద్దేశంతో సీఐ పేర్కొన్నారు. తన డ్యూటీ తాను చేస్తున్నట్లుగా చెప్పిన సీఐకు.. తన ఇంటిపై దాడి చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
మొత్తంగా బెయిల్ మీద బయటకు వచ్చిన అంబటి.. తిరిగి గుంటూరులోని ఇంటికి చేరుకునే సమయానికి పలు ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఒక పోలీసు అధికారితో గొడవను అర్థం చేసుకోవచ్చని.. ప్రతి ఒక్కరిపై చిందులు వేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. అయినా.. అంబటి స్థాయి నేత జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన వేళ.. ఆ మాత్రం హడావుడి లేకుండా ఉంటుందా చెప్పండి?
