సీఐ వర్సెస్ అంబటి.. ఏం జరిగింది?
అందరూ కలిసి వెళ్తామని.. ముందుగానే పర్మిషన్ పెట్టుకున్నామని అంబటి సదరు సీఐతో వాగ్వాదానికి దిగారు.
By: Tupaki Desk | 4 Jun 2025 7:35 PM ISTవైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. పల్నాడు జిల్లాకు చెందిన ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయికి ఈ వివాదం రేగింది. నువ్వు-నువ్వు.. అనుకుంటూ ఇరువురు కూడా రోడ్డుపై వివాదానికి దిగారు. అయితే.. ఇది మాటలకే పరిమితమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిం ది. తాజాగా వైసీపీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా.. `వెన్నుపోటు దినం` పేరుతో నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో కూటమి పార్టీలు విజయం దక్కించుకుని ఏడాది అయినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలదని ఈ కార్యక్రమం ద్వారా చెప్పాలని అనుకున్నారు.
ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన తెలిపి.. అనంతరం.. కలెక్టర్లకు , ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తన అనుచరులతో కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఓ అరగంట పాటు నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో వందల మంది అనుచరులను పోగు చేశారు. వారందరితోనూ కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లాలని నిర్ణయించారు. అయితే.. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. వీరిని అడ్డుకున్నారు. ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి ఐదారుగురు మాత్రమే కలెక్టరేట్‌లోకి వెళ్లాలని సీఐ సూచించాడు. అయితే.. అంబటి దీనిని వ్యతిరేకించారు.
అందరూ కలిసి వెళ్తామని.. ముందుగానే పర్మిషన్ పెట్టుకున్నామని అంబటి సదరు సీఐతో వాగ్వాదానికి దిగారు. అయితే.. అనుమతి ఇవ్వలేదని.. ఇస్తే.. అనుమతి పత్రం చూపించాలని సదరు సీఐ కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు-నువ్వు.. అంటూ పరస్పరం పిలుచుకోవడంతోపాటు.. ఆపుతానని సీఐ అంటే.. ఆపి చూడు అని అంబటి సవాల్ రువ్వారు. ఇలా.. ఒకరికొకరు తోసుకునే వరకు పరిస్థితి వచ్చింది. అయితే.. తోసుకోలేదు.. కానీ.. ఒకరినొకరు అరుచుకున్నారు. ఈ వివాదం పెరిగి పెద్దదవుతున్న క్రమంలో అనూహ్యంగా సర్దుమణిగింది. కానీ.. ఈ విషయంలో ఇరు పక్షాలదీ తప్పు ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అయితే.. ఇంత జరుగుతున్నా.. అంబటికి మద్దతుగా వైసీపీనాయకులు ఎవరూ రాకపోవడం గమనార్హం. మరోవైపు.. సీఐ కూడా దూకుడు పెంచడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. ప్రతిపక్షంగా వైసీపీ నాలుగురోజుల ముందే అనుమతి కోరింది. ఈ సమయంలో కొద్దిమందిని అనుమతిస్తామని .. ముందుగానే చెప్పి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా.. అసలు కార్యక్రమం ప్రారంభమైన తర్వాత.. అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తానికి ఎలాంటి వివాదం ముదరకుండానే.. ఇది సర్దు మణిగింది.
