అంబటికి బిగ్ టాస్క్ అప్పగించిన జగన్.. సాధ్యమయ్యేపనేనా?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ పెద్ద భారం మోపారు.
By: Tupaki Desk | 25 Jun 2025 1:15 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆ పార్టీ అధినేత జగన్ పెద్ద భారం మోపారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అంబటికి కీలకమైన గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. టీడీపీకి కంచుకోటగా భావించే గుంటూరు వెస్ట్ లో అంబటి మాత్రమే నెగ్గుకు రాగలరని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2009లో ఆవిర్భవించిన గుంటూరు వెస్ట్ లో ఒకసారి కాంగ్రెస్, ఆ తర్వాత వరుసగా టీడీపీ గెలిచాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజని సుమారు 50 వేల ఓట్లతో ఓటమి చవిచూశారు. దీంతో ఆమెను తిరిగి చిలకలూరిపేట పంపిన జగన్, గుంటూరు వెస్ట్ బాధ్యతలను సీనియర్ నేత అంబటికి అప్పగించారు.
వరుసగా మూడు సార్లు గుంటూరు వెస్ట్ ను కైవసం చేసుకున్న టీడీపీకి ఆ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే గళ్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర ఈ నియోజకవర్గానికి చెందిన వారే. నియోజకవర్గంలో బీసీలు అధిక సంఖ్యలో ఉండగా, వైశ్య, కమ్మ సామాజికవర్గాలకు కూడా గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ పరిస్థితుల్లో అంబటికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. కృష్ణా జిల్లాకు చెందిన అంబటి దాదాపు నాలుగు దశాబ్దాలుగా గుంటూరు రాజకీయాలతో మమేకయ్యారు. 1988లో గుంటూరు నుంచే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో రేపల్లె నుంచి గెలిచారు.
1994, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన అంబటి.. వైఎస్ మరణం తర్వాత మాజీ సీఎం జగన్ కు దగ్గరయ్యారు. 2011లో వైసీపీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లికి షిఫ్ట్ అయిన అంబటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2014లో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా చేతిలో ఓడిపోయారు. అయితే సత్తెనపల్లిలో అంబటి స్థానికేతరుడు అన్న విమర్శల కారణంగా పార్టీ బలం పుంజుకోవడం లేదని భావించిన అధిష్టానం సమన్వయకర్త బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది.
సత్తెనపల్లిలో అంబటి స్థానంలో గుజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించింది. దీంతో అంబటికి గుంటూరు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధినేత ఏం చెప్పినా తూ.చ. తప్పకుండా ఆచరించే అంబటి కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల అరెస్టులను ఖండిస్తూనే టీడీపీ సోషల్ మీడియా సైన్యం అరెస్టు కోసం పోరాడుతున్నారు. తానే స్వయంగా నల్లకోటు వేసుకుని తన పిటిషన్లపై వాయిదాలు వేస్తున్నారు. దీంతో అంబటికి మరో కీలక బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్. ఏ పని అయినా అంబటి చేయగలరనే నమ్మకంతో పార్టీకి అంతుచిక్కకుండా ఉన్న గుంటూరు వెస్ట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ నియోజకవర్గంలో పటిష్టంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడం సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది.
