అంబటికి గుంటూరు 'వెస్ట్'.. పొలిటికల్ రోస్ట్ ..!
నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 9:30 AM ISTతాజాగా మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును.. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి సత్తెనపల్లి నియోజకవర్గ నుంచి రేపల్లెకు మార్చి ఉంటే ఆ ఫలితం వేరేగా ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే రేపల్లె లో గతంలో అంబటి రాంబాబు రాజకీయాలు చేశారు. ఇక సత్తెనపల్లిలో ఆయన గెలిచారు కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలకు ఆయనకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు గుంటూరు వెస్ట్ కు తీసుకురావడం ద్వారా ఇబ్బందేనని అంటున్నారు.
బలమైన కమ్మ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో అంబటి రాంబాబు రాజకీయాలు సాగడం కష్టమే అన్నది నాయకులు చెబుతున్న మాట. ఇది ఎవరో ప్రత్యర్థులు గిట్టని వారు చెబుతున్న మాట కాదు. వైసిపిలోని సీనియర్లు గుంటూరు వెస్ట్ కి చెందిన నాయకులే కొందరు చెబుతున్నారు. గతంలో కావటి మనోహర్ నాయుడుకు మేయర్ పదవి ఇచ్చారు. ఆయన కోరకుండానే చిలకలూరిపేటకు పంపించారు. వాస్తవానికి ఆయన గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఇక్కడ కమ్మ- కాపు సామాజిక వర్గాలు ఉండటంతో అది లాభిస్తుందని భావించారు.
కానీ, జగన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన విడదల రజనీని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించారు. ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆమెను తిరిగి చిలకలూరిపేటకు పంపించారు. దీంతో మనోహర్ నాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో వెస్ట్ నియోజకవర్గంలో వైసిపి ప్రయోగాలు ఫలించడం కష్టంగానే మారింది అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. అంతేకాదు వెస్ట్ లో సత్తెనపల్లి నుంచి వచ్చిన నాయకుడికి ఏ మేరకు స్థానిక నేతలు సహకరిస్తారని కూడా ప్రధాన సమస్య.
ఏదేమైనా ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితులు పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు ఫైర్ బ్రాండ్ వంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే కూడా అంబటికి సెగ పెంచే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గల్లా మాధవి దూకుడుగానే ఉన్నారు. మరి ఆమెను తట్టుకుని అంబటి రాంబాబు ముందుకు సాగడం ఏమేరకు సాధ్యమో చూడాలి. ఆయన దూర దృష్టికి విజ్ఞతతో పాటు ఆయన రాజకీయ దూకుడుకు ఒక పరీక్షేనన్నది పరిశీలు చెబుతున్న మాట. ఏదేమైనా ఈ మార్పు సక్సెస్ అవుతుందా? విఫలమవుతుందా? అనేది చూడాలి.
