Begin typing your search above and press return to search.

మీ మేనత్తలు చంద్రబాబుకు రాఖీ కట్టారా? వారికి ఎప్పుడు అయినా చీర పెట్టారా? లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి ఫైర్

ఉచిత బస్సు పథకంపై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నిలదీశారు.

By:  Tupaki Desk   |   16 Aug 2025 11:37 PM IST
మీ మేనత్తలు చంద్రబాబుకు రాఖీ కట్టారా? వారికి ఎప్పుడు అయినా చీర పెట్టారా? లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి ఫైర్
X

ఏపీలో ఉచిత బస్సు పథకం ప్రారంభం తర్వాత అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకం శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం మొత్తం ప్రయాణించడానికి వీలు కల్పించినా, ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించింది. దీనిపై వైసీసీ విమర్శలు ఎక్కుపెట్టింది. అనుమతి లేని బస్సుల్లో ప్రయాణించిన మహిళల అభిప్రాయాలను తెలుసుకుంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఉచిత పథకంపై ఘనంగా ప్రచారం చేసుకుని పరిమితులు విధించడాన్ని తప్పుపడుతూ వైసీపీ నేతలు ప్రభుత్వంపై మాటల దాడి చేస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఉచిత బస్సు పథకంపై మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నిలదీశారు. ఇక అదే సమయంలో శుక్రవారం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై చేసిన విమర్శలపైనా దీటైన జబాబు చెప్పారు. శుక్రవారం విజయవాడ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పిన మంత్రి లోకేశ్.. మాజీ సీఎం జగన్ తన కుటుంబంలోని మహిళలకే న్యాయం చేయడం లేదని విమర్శించారు. చెల్లిలను వదలేశావు, తల్లిని తరిమేశావు అంటూ జగన్ పై లోకేశ్ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ చెల్లిల్లు ఆయనకు కనీసం రాఖీ కట్టలేదని ఎత్తిచూపారు. లోకేశ్ విమర్శలు సోషల్ మీడియాలో టీడీపీ వైరల్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

అయితే వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో మాజీ మంత్రి అంబటి మంత్రి లోకేశ్ విమర్శలపై స్పందించారు. జగన్ చెల్లిల్లు ఆయనకు రాఖీకట్టలేదన్న లోకేశ్ విమర్శలను కోట్ చేస్తూ చంద్రబాబు చెల్లెళ్లు..ఆయనకు ఎప్పుడైనా రాఖీ కట్టారా? అంటూ నిలదీశారు. అంతేకాకుండా వారిని ఏనాడైనా పిలిచి చీర పెట్టారా? అంటూ ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ ముందు తనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి. దీంతో వైసీపీ శ్రేణులు అంబటి వీడియోను సోషల్ మీడియాలో ట్రెండింగుకు పెట్టాయి. ఇదే సమయంలో చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడును సరిగా చూసుకోలేదని కూడా అంబటి విమర్శలు గుప్పించారు. దీంతో ఇరు పార్టీలు రాజకీయాన్ని వదిలేసి కుటుంబ వ్యక్తిగత అంశాలపై ఫోకస్ చేశాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

అంబటి ఎదురుదాడి వైసీపీకి కొంత ఉపశమనం కలిగించిందని ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు తప్ప ఆయన కుటుంబంలో ఎవరూ రాజకీయంగా యాక్టివ్ ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అత్తింటి కుటుంబమే రాజకీయంగా సుపరిచితం. చంద్రబాబు సోదరుడు ఒకసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసినా, ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవలే మరణించారు. ఇక చంద్రబాబుకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నప్పటికీ వారెప్పుడూ రాజకీయంగా చర్చలోకి రాలేదు. చంద్రబాబు కుటుంబ వేడుకలు తప్పితే, రాజకీయ కార్యక్రమాల్లో వారు కనిపించలేదు. ఇదే సమయంలో రాఖీ పండుగల సమయంలో కూడా చంద్రబాబుకు పార్టీ సహచరులు రాఖీ కట్టిన సందర్బాలు తప్ప, సొంత చెల్లెళ్లు రాఖీ కట్టిన ఫొటోలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ విషయాన్ని గమనించి అంబటి టీడీపీని మంత్రి లోకేశ్ ను ఇరుకన పెట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు.

అయితే మాజీ సీఎం జగన్ విషయంలో ఇది పూర్తి విరుద్ధమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కుటుంబం మొత్తం రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నవారేనని గుర్తుచేస్తున్నారు. ఆయన సొంత సోదరి షర్మిల ఏపీసీసీ చీఫ్ గా ఉండగా, తల్లి విజయలక్ష్మి గతంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడు ఆ పోస్టు ఖాళీగా ఉన్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక షర్మిలతో కుటుంబ, ఆర్థిక, రాజకీయ విభేదాలతో జగన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారిందని అంటున్నారు. అందుకే ఈ విషయంలో ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని అంటున్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటి విభేదాలు ఉంటాయని గతంలో ఒకసారి జగన్ తమ విభేదాలు సాధారణ కుటుంబ సమస్యగా నివేదించినా, ఆయన రాజకీయ ప్రత్యర్థులు వదలడం లేదు. అయితే ఇన్నాళ్లకు మాజీ మంత్రి అంబటి లేవనెత్తిన ప్రశ్నలు ఇకపై వైసీపీ అధినేత జగన్ కు కాస్త ఊరట కలిగించేవిగా చెబుతున్నారు.