అంబటి లాజిక్కు.. వైసీపీకి పెద్ద ఓదార్పు!
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశాలు ఆ పార్టీ హైకమాండ్ కు పెద్ద ఓదార్పుగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 3 Aug 2025 4:27 PM ISTమాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశాలు ఆ పార్టీ హైకమాండ్ కు పెద్ద ఓదార్పుగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న లిక్కర్ స్కాంలో దర్యాప్తు అధికారులు లీకులతో సీనియర్ నేతలు చాలా మంది మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. కానీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం ప్రతి విషయంపైనా స్పందిస్తూ వైసీపీ కేడరుకు మనోధైర్యం ఇస్తున్నారని అంటున్నారు. తాజాగా రెండు ఉదంతాల్లో వైసీపీ పూర్తిగా డైలమాలో పడిపోగా.. నేనున్నా అంటూ పార్టీని వెనకేసుకుని అంబటి చేసిన వ్యాఖ్యలు కేడరుకు ధైర్యం ఇచ్చిందని అంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో రూ.11 కోట్ల నగదు లభ్యమైంది. ఈ డబ్బు లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు అయిన కేసీరెడ్డి రాజశేఖరరెడ్డిది అంటూ ఏ40 వరుణ్ పురుషోత్తం వాంగ్మూలమిచ్చాడని సిట్ ప్రకటించింది. అయితే తనకు బెయిలు రాకుండా అడ్డుకునేందుకు సిట్ కట్టు కథ అల్లిందని ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ1 కేసిరెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే డబ్బు పట్టుబడిన వెంటనే వైసీపీలో ఇతర నేతలు తొట్రుపాటుకు లోనవ్వగా అంబటి మాత్రం ఆ డబ్బుతో వైసీపీకి ఏం సంబంధం అంటూ ఎదురు తిరిగారు. అదేవిధంగా తాజాగా లిక్కర్ కేసులో ఏ34 వెంకటేశ్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో కూడా వైసీపీని ఆత్మరక్షణలో పడేయగా, మళ్లీ అంబటి తెరపైకి వచ్చారు.
లిక్కర్ స్కాంలో కమీషన్ గా వసూలు చేసిన డబ్బును డెన్ లో దాచి ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని సిట్ తోపాటు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి ఆధారంగా వెంకటేశ్ నాయుడు ఉన్న వీడియోను బయటపెట్టింది. అయితే ఆ వీడియోపైనా వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడలేకపోయారు. కానీ అంబటి మాత్రం తన లాజిక్కుతో ప్రభుత్వాన్ని కూడా గందరగోళంలోకి నెట్టేశారని పరిశీలకులు అంటున్నారు. వీడియోలో వెంకటేశ్ నాయుడు డబ్బు లెక్కిస్తున్న దృశ్యంలో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయని అంబటి లేవనెత్తారు. 2024 ఎన్నికలకు డబ్బు పంపిణీ చేశామని చెబుతున్నారని, అయితే 2023లోనే రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేసిందని అంబటి గుర్తు చేస్తున్నారు. రద్దు చేసిన నోట్లను ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించడం ద్వారా ఆ వీడియో ఇప్పటిది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. మాజీ మంత్రి అంబటి లేవనెత్తిన ఈ లాజిక్కు వైసీపీకి పెద్ద ఓదార్పుగా మారిందని అంటున్నారు. వీడియోను చూసిన వారు ఎవరైనా రూ.2 వేల నోట్లపై సందేహం వ్యక్తం చేస్తారని అంటున్నారు. అయితే సిట్ మాత్రం ఆ డబ్బు వెంకటేశ్ నాయుడు లిక్కర్ స్కాంలో కమీషన్ గా తీసుకున్నదేనని నిరూపించే బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతోంది.
