Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి అంబటికి మొదలైన కౌంట్ డౌన్? సత్తెనపల్లెలో డొంక కదుపుతున్న సర్కారు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక స్కాంలు, అక్రమ దందాలపై అందిన ఫిర్యాదులతో వివిధ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Sept 2025 8:00 PM IST
మాజీ మంత్రి అంబటికి మొదలైన కౌంట్ డౌన్? సత్తెనపల్లెలో డొంక కదుపుతున్న సర్కారు
X

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అనేక స్కాంలు, అక్రమ దందాలపై అందిన ఫిర్యాదులతో వివిధ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తోంది. అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలపై కేసులు నమోదు చేయించింది. లిక్కర్ స్కాంలో అరెస్టులు చేయగా, మాజీ మంత్రులు కొడాలి నాని, విడదల రజిని, పేర్ని నాని, జోగి రమేశ్, ఆర్ కే రోజాపై ఫిర్యాదులు ఆధారంగా కేసులు పెట్టింది. వీరంతా కోర్టు రక్షణతో అరెస్టు నుంచి తప్పించుకోగా, ఇప్పుడు ఈ జాబితాలో అంబటి రాంబాబు పేరు కూడా ప్రభుత్వం చేర్చించిందని కథనాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు చెబుతున్నారు.

ప్రైవేటు కేసులు వేసిన అంబటి

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. వైసీపీలో పార్టీ అధినేత జగన్ తర్వాత ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్న అంబటి సొంత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరీ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేస్తున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన అంబటి కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తూ ఆయనే నల్ల కోటు వేసుకుని కోర్టుకు వెళ్లారు. అంతేకాకుండా కొందరు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనా ప్రైవేటు కేసులు వేశారు. ఈ నేపథ్యంలో అంబటిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం సమాయుత్తమైందన్న ప్రచారం ఉత్కంఠ రేపుతోంది.

అరెస్టులతో దడ పుట్టిస్తున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వైసీపీ నేతల అరెస్టుతో ఆ పార్టీ కేడరులో వణుకుపుట్టిస్తోంది. మాజీ మంత్రి కొడాలి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంటి వారు ప్రధాన టార్గెట్ గా ప్రచారం అవడంతో వారు ప్రధాన రాజకీయ స్రవంతికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ, వైసీపీ వాయిస్ ను ప్రజల్లోకి తీసుకువెళుతున్న అంబటిని అరెస్టు చేయించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు మాజీ మంత్రి అంబటికి వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్దగా చెప్పుకునే స్థాయిలో చర్యలు తీసుకోలేదు. కాని తొలిసారిగా ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విజిలెన్స్ విచారణకు ఆదేశించారని ప్రచారం జరగడం రాజకీయంగా కాకపుట్టిస్తోంది.

భారీ ఎత్తున అక్రమాలపై ఆరోపణలు

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ నుంచి ఉద్యోగుల బదిలీల వరకు అంబటి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించారని, వైసీపీలో కూడా ఆయన బాధితులు ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించినట్లు చెబుతున్నారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు విక్రయించారని ఆయనపై ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా మట్టి, మగ్గురాయి తవ్వకాల్లోనూ అంబటికి డబ్బు అందినట్లు జరుగుతున్న ప్రచారంపై నిగ్గు తేల్చాలని ప్రభుత్వం విజిలెన్స్ ను ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మాజీ మంత్రి అంబటికి ఉచ్చు బిగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.