Begin typing your search above and press return to search.

ఆస్తుల్లోనే కాదు అప్పుల్లోనూ ముకేశ్ అంబానీనే టాప్

రిలయన్స్ అధినేతగా సుపరిచితమైన ఆయన.. తాజాగా విడుదలైన ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఏకంగా రూ.3.13 కోట్ల అప్పు చేసినట్లుగా తేలింది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 5:52 AM GMT
ఆస్తుల్లోనే కాదు అప్పుల్లోనూ ముకేశ్ అంబానీనే టాప్
X

వినేందుకు విచిత్రంగా ఉన్న ఇది నిజం. దేశంలోనే అత్యంత సంపన్నుడు. అపర కుబేరుడు ఎవరు? అన్న ప్రశ్న వేసినంతనే.. మరో మాటకు అవకాశం లేకుండా పెద్దోళ్ల నుంచి చిన్న పిల్లల నోటి నుంచి వచ్చే సమాధానం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని అని. నిజమే.. ఆస్తుల్లో అదిరేలా ఉండే ముకేశ్ అంబానీ సంపద ఒక లెక్క అయితే.. అప్పుల్లోనూ దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న వ్యక్తి కూడా ఆయనే అన్న విషయాన్ని తాజాగా వెల్లడైన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది.

రిలయన్స్ అధినేతగా సుపరిచితమైన ఆయన.. తాజాగా విడుదలైన ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఏకంగా రూ.3.13 కోట్ల అప్పు చేసినట్లుగా తేలింది. దేశంలో అత్యధిక అప్పు చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతూ.. తరచూ వార్తల్లో నిలిచే వోడాఫోన్ ఐడియా అప్పుల గురించి తెలిసిందే. అయితే.. ఈ సంస్థకున్న అప్పు మొత్తం కూడా రిలయన్స సంస్థ కంటే చాలా తక్కువ కావటం గమనార్హం.

ఇక.. దేశంలోనే పెద్ద విద్యుత్ రంగ సంస్థల్లో ఒకటైన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రూ.2.2 లక్షల కోట్ల అప్పుతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. భారతి ఎయిర్ టెల్ కూడా దేశంలో ఎక్కువ అప్పు తీసుకున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంస్థకున్న మొత్తం అప్పు రూ.1.65 లక్షల కోట్లు. దేశంలోనే అతి పెద్ద చమురు సంస్థగా పేరున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు రూ.1.4 లక్షల కోట్లు ఉండగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కు రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంది.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అప్పు సైతం రూ.1.26 లక్షల కోట్లు. దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్ గా పేరున్న టాటా మోటార్స్ అప్పు కూడా రూ.1.25 లక్షల కోట్లుగా ఉంది. దేశీయంగా దిగ్గజ ఇంజనీరింగ్ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టుబ్రో (అదేనండి ఎల్ అండ్ టీ) సంస్థకు అప్పు మొత్తం రూ.1.18 లక్షల కోట్లు. లక్ష కోట్ల కంటే ఎక్కువ అప్పు ఉన్న కంపెనీల జాబితాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉంది. అయితే.. ఇంత అప్పు ఉండటం తప్పా? అంటే అలా అనటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒక కంపెనీ ఎదుగుతున్నప్పుడు నిధుల అవసరం ఎక్కువగా ఉంటుంది.

ఇందులో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా భారీగా నిధుల్ని సేకరిస్తూ ఉంటుంది. ఇందుకు దేశీయ కంపెనీలే కాదు.. అంతర్జాతీయంగా కూడా పెద్ద పెద్ద సంస్థలు అప్పులు చేస్తూ ఉంటాయి. కొసమెరుపు ఏమంటే.. భారీగా అప్పు చేసిన కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్ లేకపోవటం గమనార్హం.