Begin typing your search above and press return to search.

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌... అతిధులుగా వచ్చే కుబేరులు, అధినేతలు వీరే!

అవును... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది

By:  Tupaki Desk   |   22 Feb 2024 12:20 PM GMT
అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌... అతిధులుగా వచ్చే కుబేరులు, అధినేతలు వీరే!
X

భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంట మరో సందడి నెలకొంది. ఇందులో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ - నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ - షైలా దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌ ను వివాహమాడనున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ప్రీ వెడ్డింగ్ ఇవెంట్ కీ సంబంధించిన చర్చ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇందులో భాగంగా ఈ పెళ్లి వేడుక కంటే ముందు గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ అతిపెద్ద ఈవెంట్‌ కు వేదిక కానుంది. ఈ కార్యక్రమం మార్చి 1- 3 తేదీల మధ్య జరగనుంది. ఈ వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన అపర కుబేరులు, పలు దేశాల రాజు, రాణులు, వివిధ కంపెనీల సీఈఓలు, పలు దేశాల రాజకీయ ప్రముఖుల హాజరుకానున్నారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇండియాలోని ఏ వివాహానికీ హాజరుకానీవారంతా ఈ ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరవుతుండటం ఆసక్తిగా మారింది.

ముఖ్య అతిథులు వీరే!:

మార్చి 1- 3 తేదీల మధ్య గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ లో జరగనున్న ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు "మైక్రోసాఫ్ట్‌" సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, "మెటా" సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, "అడోబ్‌" సీఈఓ శంతను నారాయణ్‌ తో పాటు "బ్లాక్‌ రాక్‌" సీఈఓ ల్యారీ పింక్‌, "బ్లాక్‌ స్టోన్‌" ఛైర్మన్‌ స్టీఫెన్‌ స్క్వార్జ్‌ మ్యాన్‌, "డిస్నీ" సీఈఓ బాబ్‌ ఐగర్‌ లతో పాటు మరికొంతమంది వ్యాపార వేత్తలు, అధినేతలు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో... ఇవాంకా ట్రంప్‌, ఖతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్‌, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్‌ రాజు, రాణి తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తుంది. వీరితో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బెర్క్‌ షైర్‌ హాథ్‌ వే, మోర్గాన్‌ స్టాన్లీ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం.

కాగా... 2022 డిసెంబర్‌ లోనే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 12న వీరిరువురూ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ని ఈ స్థాయిలో ప్లాన్ చేస్తుంది అంబానీ ఫ్యామిలీ!