ట్రంప్ తో ముకేశ్ అంబానీ మీటింగ్ షెడ్యూల్.. ఎక్కడంటే?
పలు దేశాధినేతలకు సాధ్యం కాని పనులు భారత అపర కుబేరుడు కం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకే సాధ్యమా? అంటే.. అవుననే చెప్పాలి
By: Tupaki Desk | 15 May 2025 10:15 AM ISTపలు దేశాధినేతలకు సాధ్యం కాని పనులు భారత అపర కుబేరుడు కం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకే సాధ్యమా? అంటే.. అవుననే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడ్ని నాలుగు నెలల వ్యవధిలో రెండోసాట్రరి భేటీ అయ్యే అవకాశం ముకేశ్ కు లభించింది. నిజానికి ట్రంప్ కు.. ముకేశ్ అంబానీ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన్ను రెండోసారి కలిసే అవకాశం అంబానీకి దక్కింది.
ట్రంప్ కోసం ఖతార్ రాజకుటుంబం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ హాజరు కానున్నట్లు చెబుతున్నారు. ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి ట్రంప్ కుమార్తె ఇవాంకా.. అల్లుడు జరేద్ ఖుష్నర్ హాజరు కావటం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా రెండుసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక విందు కోసం వంద మందికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం అందుకున్న వారిలో ముకేశ్ అంబానీ కుటుంబం ఒకటన్నది తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే పలు నిర్ణయాలకు రిలయన్స్ వ్యాపారాలకు లింకు ఉందన్న సంగతి తెలిసిందే. గత ఏడాది వెనెజువెలా నుంచి ముడి చమురు దిగుమతిని పున: ప్రారంభించటానికి అమెరికా నుంచి రిలయన్స్ మినహాయింపులు పొందిన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వెనుజువెలా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ 25 శాతం టారిఫ్ ను విధించటంతో ఆ దిగుమతి ఆగింది.
రష్యా నుంచి ముడిచమురు రిలయన్స్ దిగుమతి చేసుకొని.. పెట్రోల్ వంటి ఇంధనాల్ని తయారుచేసి అమెరికాకు అమ్ముతోంది. గూగుల్.. మెటా వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు రిలయన్స్ జియోకు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏమైనా.. ట్రంప్ తో ముకేశ్ కు ఉన్న అనుబంధం తాజా పరిణామం మరోసారి స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.
