Begin typing your search above and press return to search.

రెండోసారి ఆ వ్యాపారంలో చేతులు కలిపిన అంబానీ.. అదానీ

ప్రపంచంలోని భిన్న ధ్రువాల్ని సైతం కలిపే శక్తి సామర్థ్యాలు ఒక్క వ్యాపారానికి మాత్రమే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:27 AM IST
రెండోసారి ఆ వ్యాపారంలో చేతులు కలిపిన అంబానీ.. అదానీ
X

ప్రపంచంలోని భిన్న ధ్రువాల్ని సైతం కలిపే శక్తి సామర్థ్యాలు ఒక్క వ్యాపారానికి మాత్రమే ఉన్నాయి. పోటాపోటీగా ప్రత్యర్థులుగా వ్యవహరిస్తున్నా.. వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి జత కడితే అదిరే లాభాలు సొంతమవుతాయని డిసైడ్ కావాలే కానీ వ్యాపార ఒరలో రెండు కత్తులు ఇట్టే ఇమిడిపోతాయి. అందుకు ఉదాహరణగా తాజాగా మరోసారి దేశంలోనే అత్యంత సంపన్నులైన అంబానీ - అదానీలు జట్టు కట్టారు. భారత్ కు చెందిన ఈ ఇరువురు కుబేరులు ఇప్పటికే మధ్యప్రదేశ్ లోని ఒక విద్యుత్ ప్రాజెక్టు కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరు గుజరాతీ వ్యాపారుల మధ్య.. వారి వ్యాపార సంస్థల మధ్య పోటీ ఎక్కువే.

ఆసియాలో అత్యంత సంపన్నుల్లో ఈ ఇద్దరు పోటాపోటీ పడుతుంటారు. అంబానీ ఒకవైపు ఆయిల్.. గ్యాస్.. రిటైల్..టెలికం తదితర రంగాల్లో దూసుకెళుతున్నారు. అయితే.. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. ఎవరి వ్యాపారం వారిది అన్నట్లుగా.. వారిద్దరి మధ్య వ్యాపార రంగాలకు సంబంధించి పోటీ కనిపించదు.ఇందుకు ఒకే ఒక్క మినహాయింపు పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టు మినహాయితే.. ఒకరి రంగంలోకి మరొకరు ఎంట్రీ ఇవ్వటం కనిపించదు. ఈ మధ్యనే అందులో కాస్త మార్పులు వచ్చాయి. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులో అదానీ మొదట ఉండగా.. ఇటీవల అంబానీ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో 2014 నుంచి రిలయన్స్ మీడియా రంగంలో (సీఎన్ బీసీ టీవీ 18, సీఎన్ఎన్ న్యూస్ 18, కలర్స్ తదితర) ఎంట్రీ ఇవ్వగా.. ఈ మధ్యనే ఎన్డీటీవీని కొనుగోలు చేసిన అదానీ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

గత ఏడాది మార్చిలో ఈ ఇరువురు ప్రముఖులు వ్యాపారం కోసం జత కట్టారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటాను కొనుగోలు చేయటం ఆసక్తికరంగా మారింది. కట్ చేస్తే.. తాజాగా ఇంధన రిటైల్ వ్యాపారంలో ఒకరినొకరు సాయం చేసుకోవటానికి వీలుగా చేతులు కలిపారు. ఇందులో భాగంగా అదానీకి చెందిన టోటల్ గ్యాస్ సీఎన్ జీ రిటైల్ ఔట్ లెట్స్ లో జియో - బీపీ తమ పెట్రోల్.. డీజిల్ ఇంధనాల్ని అమ్ముతుంది.

అదే సమయంలో జియో - బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ తన సీఎన్ జీ పంపుల్ని ఏర్పాటు చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. జియో - బీపీ అన్నది అంబానీకి చెందిన జియో.. బ్రిటన్ కు చెందిన బీపీ సంస్థ మధ్య జాయింట్ వెంచర్. అదే సమయంలో అదానీకి చెందిన ఏటీజీఎల్ ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీస్ తో కలిపి జాయింట్ వెంచర్ చేస్తోంది. ఇప్పుడు అంబానీ - అదానీలు చేతులు కలపటం ద్వారా వర్తమానంలోనే కాదు ఫ్యూచర్ లోనూ ఈ రెండు సంస్థలకు చెందిన పెట్రోల్, గ్యాస్ బంకుల్లో ఒకరి సేవల్ని మరొకరు ఇచ్చి పుచ్చుకుంటారు.దీంతో.. మరింత వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలు కలుగుతుంది.