Begin typing your search above and press return to search.

ఉద్యోగులపై నిఘా.. దిగ్గజ సంస్థకు రూ.280 కోట్లు జరిమానా!

ఈ–కామర్స్‌ దిగ్గజం.. అమెజాన్‌ కు ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ... సీఎన్‌ఐఎల్‌ గట్టి షాక్‌ ఇచ్చింది

By:  Tupaki Desk   |   24 Jan 2024 5:30 PM GMT
ఉద్యోగులపై నిఘా.. దిగ్గజ సంస్థకు రూ.280 కోట్లు జరిమానా!
X

ఈ–కామర్స్‌ దిగ్గజం.. అమెజాన్‌ కు ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ... సీఎన్‌ఐఎల్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. అమెజాన్‌ సంస్థకు భారీ జరిమానా వేసింది. ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా ఏర్పాటు చేసినందుకు 32 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.280 కోట్లు) జరిమానా విధించింది. అమెజాన్‌ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కాగా ఫ్రాన్స్‌లో అమెజాన్‌కు 8 అతిపెద్ద డెలివరీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)... జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌) ప్రకారం.. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం సేకరించాలన్నా, దాన్ని వినియోగించాలన్నా ఉద్యోగుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ సంస్థ ఉద్యోగుల సమాచారాన్ని సేకరించినట్లు ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ.. సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది. దీనిపై ఉద్యోగులు తమకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. దీంతో విచారణ జరిపి 32 మిలియన్‌ యూరోలు జరిమానాగా విధించినట్లు తెలిపింది.

కాగా అమెజాన్‌.. వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్‌ యంత్రాల ద్వారా ఉద్యోగులపై నిఘా పెట్టినట్టు సీఎన్‌ఐఎల్‌ వెల్లడించింది. పది నిమిషాల కంటే ఎక్కువ సమయం స్కానింగ్‌ యంత్రాలు పనిచేయకుంటే.. అవి యాజమాన్యానికి అలర్ట్‌ మెసేజ్‌ పంపుతాయని సీఎన్‌ఐఎల్‌ తెలిపింది. వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని అమెజాన్‌ కంపెనీ విశ్లేషిస్తున్నట్లు ఆరోపించింది. అలాగే పని ప్రదేశంలో ఉద్యోగులు ఎంతసేపు ఉంటున్నారనే సమాచారాన్ని కూడా అమెజాన్‌ సేకరిస్తున్నట్లు అభియోగాలు మోపింది. ఈ తరహా నిఘా పెట్టడం వల్ల అమెజాన్‌ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది.

మరోవైపు ఉద్యోగులపై నిఘాను అమెజాన్‌ సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించేందుకే ఈ చర్యలు చేపట్టామని తెలిపింది. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులను డెలివరీ చేసే ముందు ఉద్యోగులు వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకే నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించింది.

ఉద్యోగులపై ఇలాంటి నిఘా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని అమెజాన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై నిఘా కోసం ఈ డేటాను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చడం గమనార్హం. సీఎన్‌ఐఎల్‌ తమకు విధించిన జరిమానాపై అప్పీల్‌ కు వెళ్తామన్నారు.