అమరావతికి వెయ్యి కోట్లు.. కానీ, అదే సమస్య!
రూ.1000 కోట్లను ఆయా పనులకు మాత్రమే వెచ్చించాలని.. స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 27 Jun 2025 9:15 AM ISTఏపీ రాజధాని, సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు అమరావతికి తాజాగా ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృ ద్ది బ్యాంకుల నుంచి నిధులు వచ్చాయి. మొత్తం 15 వేల కోట్లను విడతల వారీగా ఇస్తామని ఒప్పందం చేసుకున్న ఈ సంస్థలు.. తాజాగా వెయ్యి కోట్ల రూపాయలను మంజూరు చేశాయి. ఈ నిధులు ప్రభుత్వ సంచిత ఖాతాకు గురువారం సాయంత్రం చేరాయి. దీంతో సీఎం ఆదేశాల మేరకు ఈ నిధులను వెంటనే రాజధాని పనులను చూస్తున్న క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ)కి జమ చేశారు.
ఈ సొమ్ములతో పనులు చకచకా జరిగిపోతాయని అందరూ అనుకుంటారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సొమ్ములు మరింత ఊపు తెస్తాయని.. సమస్యలు సానుకూలంగా పరిష్కారం కూడా అవుతాయని అనుకుంటారు. కానీ, ఇక్కడే పెద్ద మెలిక ఉంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇస్తున్న నిధులతో కొత్తగా చేపట్టే నిర్మాణాలకు వాటిని వెచ్చించేందుకు వీల్లేదు. కేవలం మౌలిక సదుపాయాలను మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది.
అంటే.. రోడ్లు(కొత్తవి కావు. ఇప్పటికే వేసిన వాటిని బాగు చేసేందుకు),వర్షపు నీరు పోయేందుకు వీలుగా డ్రెయిన్ల నిర్మాణం, నీటి సరఫరా, మురుగునీటి పారుదల(డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టవచ్చు), విద్యుత్ సౌకర్యం వంటివాటిని మాత్రం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.1000 కోట్లను ఆయా పనులకు మాత్రమే వెచ్చించాలని.. స్పష్టం చేసింది. కాగా.. ఈ పనులు చేపట్టిన తర్వాత.. సదరు బ్యాంకు అధికారులకు సీఆర్ డీఏ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారు వచ్చి పరిశీలించిన తర్వాత.. సంతృప్తి చెందితే.. తదుపరి నిధులు విడుదల చేస్తారు. దీనికి గాను మూడు మాసాల సమయం ఉంటుంది. ఏదేమైనా.. అసలు పనులు ఆగిపోకుండా.. ముందుకు సాగడంతో పాటు.. కీలక ప్రాజెక్టులకు ఈ నిధులు సహాయకారిగా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
