కూటమి సంబరాలపై ఎఫెక్ట్.. అందుకే ఇలా చేశారా ..!
రాజధాని అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతు న్నాయి.
By: Tupaki Desk | 9 Jun 2025 5:00 AM ISTరాజధాని అమరావతి మహిళలపై సాక్షి మీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాంతంలోని మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉండడమే కాకుండా.. తీవ్రంగా అవమానించేవిగా కూడా ఉన్నాయి. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు.. వివాదాలు కూడా తెరమీదికివచ్చాయి. అయినప్పటికీ సదరు వ్యాఖ్యాత మాత్రం దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేయడం మరో వివాదంగా మారింది.
ఇక, ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా.. తీవ్రంగా చర్చిస్తోంది. అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ పూర్వకమే ఉందా? లేక.. ఏదైనా వ్యూహం ఉందా? అనేది కూడా .. కూటమి పార్టీల నాయకుల మధ్య జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. ప్రస్తుతం మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. ఏడాది పాలనలో చేసిన మేళ్లను వివరించేందుకు రెడీ అయింది.
అదేసమయంలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు.. అన్యాయాలు, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి వాటి ని కూడా చర్చించాలని నిర్ణయించింది. ఇది పెద్ద ఎత్తున కూటమికి మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు సహా అందరూ భావిస్తున్నారు. ఏడాది కాలంలో పెంచిన పింఛన్లు, అదేవిధంగా రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం నిర్మాణానికి తీసుకువచ్చిన నిధులు.. పెట్టుబడులు రావడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే అంటే.. ఏడాది పాలన సంబరాలకు కేవలం ఐదు రోజుల ముందు.. ఇలా దారుణమైన వ్యవహారం వెలుగు చూడడం అంటే.. ఖచ్చితంగా సర్కారును ఆ దిశగా ఆలోచన చేయకుండా.. ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న కుట్ర ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. రాజధాని మహిళలపై విమర్శలు చేసిన వారిని ఉపేక్షిస్తే.. ఇది చర్చగామారుతుంది. అలాగని చర్యలు తీసుకున్నా.. అది కూడా చర్చగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా కూటమి పాలన ఏడాది సంబరాలపై ఎఫెక్ట్ పడాలనే ఇలా వ్యాఖ్యానించి ఉంటారన్నది ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఆలోచన. మరి ఏం చేస్తారో చూడాలి.
