కృష్ణంరాజు రిమాండు రిపోర్టులో కీలక విషయాలు!
సాక్షి చానల్ చర్చలో భాగంగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 13 Jun 2025 11:56 AM ISTసాక్షి చానల్ చర్చలో భాగంగా అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అమరావతి మహిళల ఫిర్యాదుతో కృష్ణంరాజుతోపాటు మరో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిందే. కొమ్మినేనిని ఇప్పటికే అరెస్టు చేయగా, పరారీలో ఉన్న కృష్ణంరాజును విశాఖ జిల్లా భీమిలిలో పోలీసులు అరెస్టు చేసి గురువారం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.
అమరావతిపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను నిందితుడు పీవీఆర్ కృష్ణంరాజులో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదని, కనీసం బాధపడటం లేదని పోలీసులు పేర్కొన్నారు. అమరావతి ప్రాంత మహిళలను దారుణంగా అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ కోరలేదు సరికదా ‘తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూలేదంటూ’ వాటిని మరింతగా సమర్థించుకునేలా వీడియోలు చేసి యూట్యూబ్లో విడుదల చేశారని న్యాయస్థానానికి తెలిపారు.
అమరావతిలో వివిధ వర్గాలు, కులాలు, మతాల వారు నివసిస్తున్నారని తెలిసే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, తద్వారా అన్ని వర్గాల మహిళలతో పాటు ప్రత్యేకంగా దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనేది అతని ఉద్దేశమని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా, సబార్డినేట్ జ్యుడిషియల్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా అత్యున్నత స్థానాల్లో పనిచేసే బ్యూరోక్రాట్లు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారనే విషయం సీనియర్ పాత్రికేయుడైన కృష్ణంరాజుకు తెలుసని అయినా ఆయన దురుద్దేశపూరితంగా మాట్లాడారని పోలీసులు న్యాయస్థానానికి చెప్పారు.
కృష్ణంరాజును మంగళగిరిలోని అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కమ్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన తుళ్లూరు పోలీసులు ఈ హేయమైన వ్యాఖ్యల వెనకున్న కుట్రలో కృష్ణంరాజు ప్రమేయం, పాత్ర, ఆయన వెనకున్న శక్తులు, ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అంశాలను వివరిస్తూ న్యాయస్థానానికి రిమాండు రిపోర్టు సమర్పించారు.
