Begin typing your search above and press return to search.

భూభారం భుజానికి ఎత్తుకున్న బాబు

అమరావతి రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలను భూసేకరణ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 9:25 AM IST
భూభారం భుజానికి ఎత్తుకున్న బాబు
X

అమరావతి రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలను భూసేకరణ చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. అంటే గుంటూరు పరిసరాలలో ఉన్న మరో 44 వేల భూమి కూడా సీఆర్డీఏ పరిధిలోకి వస్తుంది అన్న మాట. రాజధాని కోసం ఈ భూమిని తీసుకుని అందులో మౌలిక సదుపాయాల కోసమే ఏకంగా పది నుంచి పదిహేను వేల ఎకరాలు వాడుతారు అని అంటున్నారు.

అంటే అందులోనే అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే రైల్వే లైన్స్ వంటివి ఉంటాయని అంటున్నారు. ఇక మిగిలిన భూమిని అభివృద్ధి చేసి భూమి యజమానులకు ఇస్తారు అని అంటున్నారు. అయితే ఈ భూమి సేకరణ అన్నది బృహత్తరమైన కార్యక్రమం అని అంటున్నారు.

ఇప్పటికే 33 వేల ఎకరాలా భూమిని ఏకంగా పది పన్నెండు ఏళ్ళ క్రితం ప్రభుత్వం తీసుకుంది. అమరావతి రూపూ రేఖా లేకపోవడంతో ఈ రోజుకీ వారు ఆశలతో ఎదురుచూస్తున్నారు. మరో వైపు చూస్తే కనుక అమరావాతి రాజధాని పునర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికి 30 వేల కోట్ల రూపాయల ఆర్థిక నిధులను సేకరించారు.

రానున్న రోజులలో ఇంతకు ఇంతా రుణాలని తెచ్చి అమరావతి రాజధాని మొదటి దశ పనులౌ 2027 నాటికి పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ పనులే భారంగా ఉంటే ఇపుడు ఇన్ని వేల ఎకరాలను సేకరించడం న్యాయమేనా మంచిదేనా సమంజసమేనా అన్న చర్చ అయితే వస్తోంది.

అమరావతి రాజధాని పేరుతో భారీ కాన్వాస్ మీదనే డిజైన్లు స్టార్ట్ చేశారు అని దానికి శక్తికి మించి పరుగులు పెడుతూంటే ఇపుడు 44 వేల ఎకరాలు తీసుకోవడం వల్ల మరింత భారం ఉండదా అంటే అక్కడ ఉన్నది చంద్రబాబునాయుడు అని ఆయన విజనరీ అని అమరావతి మరింత భారీ కాన్వాస్ మీద ఇంతకు ఇంతా అద్భుతంగా వస్తుందని అంటున్నారు.

అయితే కాలం ఎపుడు వేగంతో ఉంటుంది. అది గిర్రున తిరిగేస్తుంది ఫలితాలు వచ్చేలోగా క్యాలెండర్ లో ఏడాదులు అలా కరిగిపోతాయి. జనాలకు చూస్తే తమకు కళ్ళ ముందు అంతా చూపించమంటారు. కాదూ కూడదు అంటే వారు తీవ్ర అసంతృప్తికి లోను అవుతారు. దాంతో ఈ వేల ఎకరాల సేకరణ అనుకున్నట్లుగా సాగి రిజల్ట్ ఇస్తే ఓకే కానీ లేకపోయినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అన్న బెంగా చింతా కూడా మరో వైపు ఉన్నాయని అంటున్నారు.

ఇక సింపుల్ గా చెప్పుకోవాలంటే 33 వేల ఎకరాలు భూసేకరణలో తీసుకుంది. ఆ మీదట ప్రభుత్వ భూములు చూస్తే మరో పాతిక వేల ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు దాంతో 58 వేల ఎకరాలు అక్కడికే అయింది అని ఇపుడు 44 వేల ఎకరాలు అంటే లక్ష ఎకరాలతో రాజధాని ఏర్పాటు చేయడమా అన్న వారూ ఉన్నారు.

పైగా అన్నీ పంట భూములే అన్నీ సారవంతమైన భూములే. అన్నీ కూడా పచ్చని భూములే తేడా వస్తే ఉన్న ఉపాధి కూడా ఇబ్బందిలో పడుతుంది కదా అన్న చర్చ కూడా ఉంది. ఇక టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ వడ్డే శోభనాదీశ్వరరావు అయితే ఈ భూముల పిచ్చి ఏమిటి చంద్రబాబూ అని మీడియా ముఖంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు పైగా ముక్కారు పంటలు పండే భూములు అన్నీ అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో వైపు చూస్తే ప్రభుత్వం అడిగినా భూములు ఇవ్వవద్దు అని రైతులకు పిలుపు ఇచ్చారు. మరి ఈ భూభారం అంతా తాను మోస్తాను అని బాబు ముందుకు వస్తే కాదనే రైతులు ఉంటారా అన్నదే చర్చ. ఏది ఏమైనా బాబు అమరావతి రాజధాని విషయంలో పెద్ద కలలే కంటున్నారు. అవి ఫలించాలని ఆయనతో పాటు అంతా కోరుకోవాలి. ఎందుకంటే అమరావతితో పాటే ఆంధ్రుల మొత్తం భవిష్యత్తు ఆధారపడి ఉంది అన్నది సుస్పష్టం కాబట్టి.