విశాఖ ఫోకస్....అమరావతికి బ్యాలెన్స్ గా !
ఈ నపధ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎన్ఎస్ఆర్ సంస్థకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
By: Tupaki Desk | 9 July 2025 8:00 AM ISTఏపీలో అమరావతి పేరిట ప్రపంచ రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమరావతి ని దాదాపుగా లక్ష ఎకరాలలో ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు భారీ ఎత్తున భూములను కేటాయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా అక్కడ భూములు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర కు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ మీద సైతం కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టేసింది. విశాఖని ఐటీ హబ్ గా మార్చాలని చూస్తోంది. దాంతో విశాఖలో అనేక ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఈ నపధ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏఎన్ఎస్ఆర్ సంస్థకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ కుదిరిన ఒప్పందం మేరకు విశాఖలోని మధురవాడ ఐటీ క్లస్టర్ లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో 10వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది.
మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీని మీద లోకేష్ మాట్లాడుతూ వాణిజ్య అనుకూల నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాబోయే నాలుగేళ్ల లో రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో ఐటి, జిసిసి రంగాల్లోనే అయిదు లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే విశాఖకు గూగుల్, టీసీఎస్, ఇంఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయి. రానున్న రోజులలో మరిన్ని సంస్థలు కూడా వస్తాయని చెబుతున్నారు. విశాఖకు ఐటీ కీర్తిని ఇవ్వడం ద్వారా రానున్న రోజులలో ఏపీలో సేవా రంగం అంటే ఈ ప్రాంతమే అని చెప్పాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో మరిన్ని పరిశ్రమలతో పాటు ఐటీ రంగం అభ్హివృద్ధికి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
