అన్‌స్టాపబుల్ అమరావతి - శాసనసభలో సరికొత్త చరిత్ర!
అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
By: Tupaki Desk | 28 March 2026 6:44 PM ISTఅమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా అమోదించిందని ప్రభుత్వం ప్రకటించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది.
ఏపీ చరిత్రలో నవ చరిత్రకు రాజధాని అమరావతికి భద్రత, భరోసా ఇచ్చేందుకు శనివారం సమావేశమైన శాసనసభ తీర్మానం చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధిలో తీసుకువచ్చేలా చట్ట సవరణ చేయాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది. సభ్యులు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని ప్రభుత్వం శాసనసభ సెక్రటరీ జనరల్ ను ఆదేశించింది.
అదేవిధంగా అమరావతి రాజధానిగా చట్టబద్దత కల్పించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్ కు అసెంబ్లీ తీర్మానాన్ని పంపుతున్నామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు కేంద్ర హోం మంత్రి కార్యాలయానికి తీర్మానం కాపీని పంపుతున్నామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. స్పీకర్ సూచనలతో తీర్మానం కాపీలను కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్ కు పంపిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపించారు.
ఇక రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానం చేయాలనే ఏకైక అజెండాతో సమావేశమైన శాసనసభ ఐదు గంటలకు పైగా సుదీర్ఘంగా సాగింది. ఎలాంటి విరామం లేకుండా కొనసాగిన సభలో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్ర భావోద్వేగంతో ఆవేశంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యవుల కేశవ్ అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అమరావతి అంశమై చోటుచేసుకున్న అనేక ఘటనలను సభలో ప్రస్తావించారు. నేటి తీర్మానంతో రాజధాని రైతుల రుణం తీర్చుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అధికారికంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
