Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి 'ఇన్న‌ర్ రింగ్ రోడ్డు'పై లేటెస్ట్ న్యూస్‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి చుట్టూ రీజిన‌ల్‌ రింగ్ రోడ్డును(ఆర్ ఆర్ ఆర్‌)నిర్మించే ప్ర‌ణాళిక విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   23 March 2026 1:05 PM IST
అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డుపై లేటెస్ట్ న్యూస్‌!
X

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి చుట్టూ రీజిన‌ల్‌ రింగ్ రోడ్డును(ఆర్ ఆర్ ఆర్‌)నిర్మించే ప్ర‌ణాళిక విష‌యం తెలిసిందే. ఇది సుమారు 450 కిలో మీట‌ర్ల‌కుపైగానే ప్ర‌ణాళిక చేశారు. ద‌శ‌ల వారీగా నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 8 లైన్ల ర‌హ‌దారిగా కూడా ప్లాన్ చేశారు. కార్గో స‌హా.. సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనువుగా ఫ్లైట్ కారిడార్‌(అవ‌స‌ర‌మైతే.. విమానాలుదిగేలా) కూడా రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. దీనికిగాను గ‌త జ‌న‌వ‌రిలోనే కేంద్ర ర‌హ‌దారుల శాఖ‌కు అమ‌రావ‌తి అభివృద్ధి ప్రాథికార సంస్థ‌(సీఆర్ డీఏ) ప్ర‌తిపాద‌న‌లు కూడా పంపించింది.

అయితే.. రీజిన‌ల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కీల‌క అప్‌డేట్ తాజాగా ప్ర‌భుత్వానికి అందింది. ఈ ర‌హ‌దారి డిజైన్‌లో భారీ మార్పులు చేస్తూ.. కేంద్ర హైవే అథారిటీ ప‌లు సూచ‌న‌లు చేసింది. తొలుత దేశంలోనే 8 లైన్లతో కూడిన అతి పొడవైన రింగ్ రోడ్డుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించ‌గా.. ప్ర‌స్తుత ప్ర‌తిపాద‌న ప్ర‌కారం.. దేశంలో మరో 20 ఏళ్ల వరకు రోడ్డు ట్రాఫిక్ కి 8 లైన్లు అవసరం లేదని 6 లైన్లకు స‌రిపోతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. అదేవిధంగా ర‌హ‌దారిపై ఎల్ ఈడీ లైట్ల‌కు ప్ర‌తిపాదించింది. గ‌తంలో ఎల‌క్ట్రిక్ లైట్ల ఏర్పాటుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది.

అంతేకాదు.. ఈ ర‌హ‌దారిపై కేవలం గ్రామాలు తగిలే ప్రాంతాల్లో మాత్రమే లైట్లు ఏర్పాటు చేసేలా కేంద్రం ప్ర‌తిపాదించింది. అలాగే.. ఆర్ ఆర్ ఆర్ ప‌రిధిలో స‌ర్వీసు రోడ్డు అవ‌స‌రం లేద‌ని కేంద్రం ప్ర‌తిపాదించింది. కచ్చా రోడ్డు యాక్సెస్ కూడా అవ‌స‌రం లేద‌ని, కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉండేట్లు చూస్తే స‌రిపోతుంద‌ని తెలిపింది. అలాగే.. ట్రిపుల్ ఆర్‌పై గరిష్ట వేగం గంటకు 120-130 కిలోమీటర్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించ‌గా.. ఇప్పుడు గరిష్ట వేగం తగ్గించి గంటకు 100 కిలోమీటర్లు మాత్రమేన‌ని కేంద్రం ప్ర‌తిపాదించింది.

తొలుత ఆర్‌.ఆర్‌.ఆర్‌ ఉత్తర భాగంలో మొత్తం 204 వంతెనలు నిర్మించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇప్పుడు వంతెనల వ్యయం భారీగా ఉండటంతో సగానికి సగం కుదింపు చేస్తూ.. ప్ర‌తిపాద‌న‌లు పంపించింది. రోడ్డు నిలువు వాలు (వర్టికల్ కర్వ్) 1300 మీటర్లు ఉండేలా డిజైన్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. త‌ద్వారా ముందే అప్రమత్తమై వేగాన్ని నియంత్రించే వీలు ఉంటుంది. కానీ.. దీనిని 350 మీట‌ర్ల‌కు కేంద్రం కుదించింది. అయితే.. ఇవి ప్ర‌తిపాద‌న‌లేన‌ని.. మ‌ళ్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం దీనిపై అభిప్రాయం చెప్పేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సీఆర్ డీఏ అధికారులు చెబుతున్నారు.