మొన్న వెలగపూడి.. నేడు రాయపూడి.. ఈ అగ్నిప్రమాదాలేంది చంద్రబాబు?
మొన్నటికి మొన్న వెలగపూడిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం షాక్ నుంచి బయటకు రాక ముందే.. తాజాగా అమరావతి రాజధానిలోని మరో ప్రాంతమైన రాయపూడిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
By: Garuda Media | 24 March 2026 11:25 AM ISTఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఇప్పుడు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఆసక్తికర అంశం ఏమంటే.. ఇటీవల కాలంలో అమరావతి పరిధిలోని వేర్వేరుప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటికి మొన్న వెలగపూడిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం షాక్ నుంచి బయటకు రాక ముందే.. తాజాగా అమరావతి రాజధానిలోని మరో ప్రాంతమైన రాయపూడిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శకుల బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడ సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంతకూ మంటలు ఎలా అంటుకున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ భారీగా పైపులను నిల్వ ఉంచింది.
అయితే.. పైపులకు నిప్పు ఎలా అంటింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అర్థరాత్రి సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు పోలీసులకు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ఫైరింజన్లతో వచ్చి మంటలుఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవటంతో.. దట్టంగా పొగ కమ్ముకుంది. ఓవైపు భారీగా మంటలు.. మరోవైపు దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చివరకు అత్యంత కష్టమ్మీద మంటల్ని అదుపు చేశారు.
గమనించాల్సిన అంశం ఏమంటే.. కొద్దిరోజుల క్రితమే వెలగపూడికి సమీపంలో ఎల్ అండ్ టీకి సంబంధించిన కోట్లాది రూపాయిల విలువ చేసే హెచ్ డీపీఈ పైపులు సైతం ఇదే తరహాలో తగలబడిపోవటం గమనార్హం. ఈ ఘటనపై అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాకముందే.. ఇదే తరహాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో.. రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న పనుల్ని దెబ్బ తీసే కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.రోజుల వ్యవధిలో ఒకే తరహాలో అగ్నిప్రమాదాలుచోటు చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. ఈ తరహా అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ మంటల వెనుకున్న గుట్టును ఏపీలోని కూటమి సర్కారు రట్టు చేస్తుందా? అన్నది చూడాలి.
