అమరావతి అమృత వర్షిణి
ఇక చంద్రబాబు అయితే అమరావతి మొత్తం ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అని ఆశాభావాన్ని చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 8:58 PM ISTఏపీ రాజధానిగా కొత్త కళ కడుతోంది అమరావతి. ఎందుకు లేట్ అయిందో కానీ ఒకందుకు మంచిదే అన్నట్లుగా కూడా ఇపుడు అనిపిస్తోంది. నిజానికి పదేళ్ళ క్రితమే అమరావతి రాజధానికి శంకుస్థాపనలు జరిగాయి. కానీ ముహూర్త బలం ఎంత ఉందో కానీ అనుకున్న స్థాయిలో పనులు ఏవీ జరగలేదు.
అపుడు విజయదశమి శుభవేళ. అయినా దక్షిణాయనంలో ఈ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. దాని వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్నది కూడా ఉంది. ఏది ఏమైనా ఇపుడు ఉత్తరాయనంలో మంచి ముహూర్తంలో అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులు మొదలవుతున్నాయి.
దాంతో అమరావతికి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా అంటున్నారు. ఇక చంద్రబాబు అయితే అమరావతి మొత్తం ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అని ఆశాభావాన్ని చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అమరావతి కోసం పెట్టిన ఖర్చు అంతా ఇంతకు ఇంత అన్నట్లుగా వెనక్కి తిరిగి వస్తుందని కూడా చెబుతున్నారు.
అమరావతి కనుక బ్రహ్మాండమైన రాజధానిగా అవతరిస్తే అది ఏపీ మొత్తాన్ని పోషిస్తుందని కూడా అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం కానీ రాయలసీమకు ఉండే ఇబ్బందులు కానీ తొలగిపోతాయని ఏపీ సమగ్రమైన అభివృద్ధికి అమరావతి ఒక దిక్సూచిగా పనిచేస్తుందని కూడా అంటున్నారు.
నిజానికి ఏ రాష్ట్రానికి అయినా ఆదాయం దండీగా వచ్చే రాజధాని ఉండాలి. హైదరాబాద్ తెలంగాణాకు అలాగే అతి పెద్ద ఆదాయ వనరుగా ఉంది. ఇక చెన్నై తమిళనాడుకు బెంగళూరు కర్ణాటకకు, ముంబై మహారాష్ట్రకు ఆదాయాన్ని తెచ్చి పెట్టేవిగా ఉన్నాయి.
ఇదే లెక్కన అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతుందని అంటున్నారు. అది కూడా చాలా తొందరలోనే జరుగుతుందని అంటున్నారు. అలా జరిగితే ఏపీలో సమూలంగా అభివృద్ధి జరుగుతుంది, అంతే కాదు సంక్షేమానికి తగినన్ని నిధులు కూడా ఉంటాయి. ఏపీ అప్పుల బాధ నుంచి రుణాల చీడ నుంచి బయటపడి ఆస్తులతో కళకళలాడుతుంది.
మరో వైపు చూస్తే కనుక ఏపీకి అమరావతి అన్నది ఒక కీలక స్థానంలో ఉంది. అది సెంటర్ పాయింట్ గా ఉంది. అటు రాయలసీమ వాసులకు ఎంత దూరమో ఇటు ఉత్తరాంధ్ర వాసులకు అంతే దూరం. అలా అందరికీ అందుబాటులో రాజధాని ఉండడం వల్ల కూడా ఆ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి సాధించడమే కాకుండా అన్ని ప్రాంతాలకు ఆ వెలుగులు ప్రసరించడానికి కారణం అవుతుంది. సంపద సృష్టి అని చంద్రబాబు తరచూ అంటూ ఉంటారు.
ఇపుడు అమరావతి విషయంలో కనుక సక్సెస్ అయితే బాబు విజన్ కి తిరుగు ఉండదు, అంతే కాదు అమరావతితోనే ఏపీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అమరావతి అమృతవర్షిణి గా మారి లక్షీ కటాక్షాన్ని అందిస్తుంది.
అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు పట్టుదల వల్లనే ఇంతదాకా వచ్చింది. లేకపోతే ఏపీకి సరైన రాజధాని లేకుండా పోయేది అని అంటున్నారు. ఇక రాజధాని లేని ఏపీకి ఒక మామూలు రాజధాని ఎందుకు ప్రపంచ రాజధాని నిర్మిస్తే రానున్న కాలంలో ఏపీ వైపు ఏకంగా ప్రపంచమే చూస్తుంది కదా అని రిస్క్ అయినా భారీ బడ్జెట్ తోనే ప్లాన్ వేశారు చంద్రబాబు.
ఆయనే చెప్పినట్లుగా ప్రతీ సంక్షోభాన్ని సవాల్ ని ప్రతిష్ట గా తీసుకుని దాని నుంచే అభివృద్ధి ఫలాలు అందుకోవాలన్నది కూడా ఉంది. దాంతో అమరావతి రాజధాని విషయంలో బాబు వేసుకున్న అంచనాలు అన్నీ తొందరలోనే ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరగాలని ఏపీ అన్నపూర్ణ మాదిరిగా మారాలని అంతా కోరుకుంటున్నారు.
