Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యుగానికి శ్రీకారం.. క్వాంటం వ్యాలీపై బిగ్ అప్డేట్

అమరావతి క్వాంటం వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ కేవలం దేశంలోనే కాకుండా, ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించడానికి సిద్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   16 Sept 2025 4:03 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యుగానికి శ్రీకారం.. క్వాంటం వ్యాలీపై బిగ్ అప్డేట్
X

అమరావతి క్వాంటం వ్యాలీతో ఆంధ్రప్రదేశ్ కేవలం దేశంలోనే కాకుండా, ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించడానికి సిద్ధమవుతోంది. చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలు తెరవనుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిరంతర శిక్షణ వంటి అంశాలు సమన్వయంతో అమలవ్వాలి. ఇది సాధ్యమైతే, అమరావతి నిజంగానే గ్లోబల్ క్వాంటం డెస్టినేషన్‌గా మారడం ఖాయం.

అతిపెద్ద ప్రణాళిక..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిలో రూపుదిద్దుకోబోయే క్వాంటం వ్యాలీపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రానికి క్వాంటం రంగం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో రెండో రోజు పలు కీలకమైన విషయాలను వివరిస్తూ రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది.

80 నుంచి 90 వేల ఉద్యోగాల సృష్టి

క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ కోసం సీఆర్డీఏ 50 ఎకరాల భూమి కేటాయించింది. అందులో నిర్మించే భవన నమూనాలు కూడా సిద్ధమయ్యాయి. రాబోయే త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంగణంలోనే 80–90 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా పని చేస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది 3 లక్షల క్యూబిట్ల సామర్థ్యంతో సూపర్ క్వాంటం కంప్యూటర్లకు కేంద్రంగా మారనుందని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు.

భారీ పెట్టుబడులే లక్ష్యం

ఐటీ, ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాటంనేని చేసిన ప్రకటన ప్రకారం.. వెయ్యి కోట్ల పెట్టుబడులతో కనీసం 100 స్టార్టప్ సంస్థలు క్వాంటం వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. జనవరి, 2026 నాటికి ఐబీఎం సంస్థ రెండు క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుంది. 2027 నాటికి మరో మూడు కంప్యూటర్లు ఇక్కడే సిద్ధం అవుతాయి. అంతేకాదు, 2030 నాటికి ఏటా 5 వేల కోట్ల రూపాయల విలువైన హార్డ్‌వేర్ ఎగుమతులు క్వాంటం వ్యాలీ నుంచే సాగాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సన్ అండ్ టుబురో (ఎల్ అండ్ టీ) వంటి జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది.

పరిశ్రమల అనుసంధానం

ప్రభుత్వ ప్రణాళికలో ఒక ప్రధాన అంశం నైపుణ్యాభివృద్ధి. ప్రతి ఏటా 5 వేల మందికి క్వాంటం కంప్యూటింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు అవకాశాలు లభిస్తాయి. వైద్యరంగం, బీమా, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటీరియల్ సైన్స్, ఎనర్జీ, పర్యావరణం వంటి 14 కీలక రంగాల్లో క్వాంటం అల్గారిథంలను వినియోగించి విప్లవాత్మక మార్పులు తేవడం సాధ్యమయ్యే పనేనని అధికారులు నమ్ముతున్నారు.

భవిష్యత్తు దిశ

ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో క్వాంటం కంప్యూటింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించినట్లు సదస్సులో పేర్కొన్నారు. కళాశాలల్లో క్వాంటం కంప్యూటింగ్‌ను కరికులమ్‌లో భాగం చేయాలని సూచించారు. ఈ దశలో యువతకు లభించే శిక్షణే రాష్ట్ర భవిష్యత్ టెక్‌ ఎకానమీకి బలమైన పునాది అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.