Begin typing your search above and press return to search.

12 నెలల్లోనే క్యాంటమ్ వ్యాలీ.. దేశంలోనే తొలిసారి

అమరావతిని గేట్ వే హబ్ గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ డిక్లరేషన్ రూపొందించారు.

By:  Tupaki Desk   |   7 July 2025 9:30 PM
12 నెలల్లోనే క్యాంటమ్ వ్యాలీ.. దేశంలోనే తొలిసారి
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30న విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాపులో ప్రతిపాదించిన డిక్లరేషన్ కు సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే తొలిసారిగా అమరావతిలో అతిపెద్ద క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానుంది. భవిష్యత్తులో ఉద్యోగాలతోపాటు అభివృద్ధికి క్వాంటమ్ కంప్యూటరింగ్ ఉపయోగపడుతుందని కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గేమ్ ఛేంజర్ గా మారనుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

అమరావతిని గేట్ వే హబ్ గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ డిక్లరేషన్ రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యంగా డిక్లరేషన్ ఆమోదించినట్లు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరో 12 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయనున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించడం, అంతర్జాతీయంగా భారత్ ను అగ్రగామిగా నిలబెట్టడం వంటి లక్ష్యాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.

వచ్చే 12 నెలల్లో ఏర్పాటు కానున్న క్వూ-చిప్-ఇన్ ద్వారా దేశంలో తొలి క్వాంటమ్ హబ్ ఏర్పాటు కానుందని అంటున్నారు. దీనివల్ల మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్టంగా మారుతుందని, వైద్య రంగంలో నయంకాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయని, వాతావరణంలో మార్పులను, ప్రక్రుతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టవచ్చని, దేశ రక్షణ కోసం శక్తిమంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు.