అమరావతిపై జగన్ మౌనం.. వ్యూహాత్మిక తప్పిదమా?
ప్రత్యేక సందర్భంలో విపక్ష నేత జగన్ తోపాటు మిగిలిన ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తోంది.
By: Tupaki Political Desk | 28 March 2026 3:07 PM ISTఏపీ రాజకీయాలను 'రాజధాని' సెంట్రిక్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వేళ ప్రతిపక్షం వైసీపీ గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మూడు రాజధానులను ప్రతిపాదించిన వైసీపీ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పడంలో గందరగోళం ఎదుర్కొంటోందా? అన్న చర్చకు కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యేక సందర్భంలో విపక్ష నేత జగన్ తోపాటు మిగిలిన ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తోంది.
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అమరావతి తీర్మానంపై చర్చ జరుగుతుంటే, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ సభలో కనిపించకపోవడాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దగ్గర నుంచి కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. రాజధానిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని ఈ రోజు మరోసారి స్పష్టమైందని విమర్శిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కీలక అంశాలపై ప్రతిపక్షం తన వాదనను బలంగా వినిపించాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ, సభకు రాకపోవడం ద్వారా వైసీపీ తన వైఖరిని స్పష్టం చేయడంలో వెనకబడిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సజ్జల క్లారిటీ.. జగన్ మౌనం!
"మేము అమరావతికి వ్యతిరేకం కాదు" అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అదే పార్టీ స్టాండ్ అయినప్పుడు, నేరుగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు తెలపడమో లేదా తమ అభ్యంతరాలను చెప్పడమో చేస్తే వైసీపీ రాజకీయంగా సరైన వ్యూహం అనుసరించినట్లు అయ్యేదని అంటున్నారు. కానీ, సభకు గైర్హాజరు కావడమే విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. కనీసం జగన్ మీడియా ముందుకు వచ్చి తన అంతరంగాన్ని బయటపెట్టినా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు.
జగన్ మదిలో ఏముంది?
ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇప్పటికీ మూడు రాజధానుల వైఖరికే మొగ్గు? చూపుతున్నారా? అన్న ప్రశ్నకు ఆస్కారమిస్తున్నారని అంటున్నారు. వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోవడంతో అమరావతికి చట్టబద్ధత కల్పించే క్రెడిట్ మొత్తం కూటమి ప్రభుత్వానికి దక్కిందని వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా వైసీపీ మౌనంగా ఉండటం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
