140 మీటర్లు.. 8 వరసలు.. దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డు
రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 12 May 2025 9:36 AMరాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం.. దేశంలో ఎక్కడా లేనట్లు 140 మీటర్ల వెడల్పుతో అతిపెద్ద రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఈ ప్రతిపాదనపై కేంద్రంతో చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు తాజాగా కేంద్ర సర్కారును ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం అయ్యే వ్యయంలో సగం రాష్ట్రం భరించేలా కేంద్రంతో అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు.
దేశానికే రోల్ మోడల్ గా అమరావతిని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రజల కలల రాజధానిలో భవిష్యత్తు తరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనతోపాటు దేశంలోని మిగిలిన నగరాలకు దీటుగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా రాజధానికే మణిహారంగా చెప్పుకునే ఔటర్ రింగురోడ్డు విస్తీర్ణాన్ని 70 మీటర్ల నుంచి 140 మీటర్లకు విస్తరించారు.
అమరావతి రింగు రోడ్డు ద్వారా రాజధానితోపాటు గుంటూరు, విజయవాడ నగరాలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతోపాటు గుంటూరు, విజయవాడ నగరాలపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తోంది. అయితే ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న 70 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణానికి మాత్రమే వీలవుతుంది. అయితే పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారులను ఆరు, ఎనిమిది వరుసలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాజధాని ఔటర్ రింగురోడ్డును సైతం 140 మీటర్లకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రింగురోడ్డు వెడల్పు పెంచాలనే నిర్ణయాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీతో ఈ విషయమై పలు దపాలుగా చర్చించారు. అయితే గతంలో అనుమతించిన 70 మీటర్ల మేరకు తాము భూ సేకరణకు నిధులు ఇవ్వగలమని, మరో 70 మీటర్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే 140 మీటర్ల మేర 8 వరుస రహదారి నిర్మాణానికి అభ్యంతరం లేదని కేంద్రం చెప్పిందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో అమరావతి ఔటర్ రింగురోడ్డు దేశంలో కెల్లా అతిపెద్దదిగా నిర్మాణానికి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు.