అమరావతిలో ప్రవాసాంధ్రుల కోసం ఐకానిక్ టవర్.. ఎన్ని విశేషాలో..
ఈ నెల 10వ తేదీ వరకు టెండర్లకు గడువు విధించారు. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని మూడు దశల్లో నిర్మిస్తారు.
By: Tupaki Desk | 4 April 2025 11:52 AM ISTరాజధాని అమరావతి నిర్మాణం అత్యద్భుత కట్టడాల సమాహారంగా నిలవనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఐదు ఐకానిక్ టవర్లు నిర్మాణానికి సిద్ధం కాగా, ప్రైవేటు సంస్థలు కూడా అంతకుమించిన అద్భుత నిర్మాణాలకు రెడీ అవుతున్నాయి. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ‘ఎన్ఆర్టీ ఐకాన్’ పేరుతో 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భారీ భవనానికి గురువారం టెండర్లు కూడా పిలిచారు. ఈ నెల 10వ తేదీ వరకు టెండర్లకు గడువు విధించారు. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ భవనాన్ని మూడు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో ఫౌండేషన్ నిర్మిస్తారు. తదుపరి బిల్డింగు సూపర్ స్ట్రక్చర్ కు టెండర్లు పిలవనున్నారు.
అమరావతికి అద్దం పట్టేలా ఎన్ఆర్టీ భవనం ఆక్రుతిని ఆంగ్ల అక్షరమాలలో మొదటి అక్షరం ‘ఎ’ను పోలి ఉంటుంది. రెండు టవర్ల మధ్య గ్లోబు ఉంటుంది. మొత్తం కనస్ట్రక్షన్ ఏరియా 11.65 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. దాదాపు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీన్ని నిర్మించనున్నారు. రెండేళ్లలో అంటే 2028 నాటికి ఈ భవనాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పూర్తిగా ప్రవాసాంధ్రుల కోసం వారి సొంత నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నివాస ప్లాట్లను కార్యాలయాలను ఎన్ఆర్ఐ ఆంధ్రులకే కేటాయిస్తారు. పార్కింగు కోసం రెండంతస్తుల సెల్లార్. దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవనం నిర్మిస్తారు.
రెండు టవర్లలోనూ 29 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ఒక టవర్ లోని మొత్తం 29 అంతస్తుల్లోనూ రెండేసి చొప్పున ప్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 29 అంతస్తుల పైన రెండు టవర్లను కలుపుతూ మరో నాలుగు అంతస్తులు నిర్మించనున్నారు. ఈ నాలుగు అంతస్తులు పూర్తిగా వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు.
ఇక రెండు టవర్ల మధ్య ఏర్పాటు చేయనున్న గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ గ్లోబ్ ఆకారంలోనూ నాలుగు అంతస్తులు ఉన్నాయి. రివాల్వింగు రెస్టారెంట్ ఉంటుంది. ఇందులో కూర్చుంటే 360 డిగ్రీల్లో నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. గ్లోబులో 10-12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగు హాల్, లాంజ్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా ఎన్ఆర్టీ క్లబ్ హౌస్ ఉంటుంది. పోడియంలోని మూడు అంతస్తుల్లో మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఫుడ్ కోర్టులు వంటివి ఉంటాయి. సదస్సులు సమావేశాల నిర్వహణకు 2 వేల సీట్ల ఆడిటోరియం, 1500 సీట్ల యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తారు.
