మారిన అమరావతి స్వరూపం.. 9 నగరాలు.. 9 జోన్లు.. !
ఏపీ రాజధాని అమరావతి స్వరూపం మారిందా? నవ నగరాలతోపాటు.. 9 జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారా ? తద్వారా పాలనను మరింత పారదర్శకంగా.. క్షేత్రస్థాయికి చేరువ చేయనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.
By: Garuda Media | 8 Jun 2026 8:15 AM ISTఏపీ రాజధాని అమరావతి స్వరూపం మారిందా? నవ నగరాలతోపాటు.. 9 జోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారా ? తద్వారా పాలనను మరింత పారదర్శకంగా.. క్షేత్రస్థాయికి చేరువ చేయనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అమరావతి రాజధాని పరిపాలనలో మార్పులు చేస్తూ.. సీఆర్ డీఏ కమిషనర్ విజయరామరాజు నిర్ణయించారు. దీంతో రాజధాని ప్రాంతాన్ని గ్రిడ్లుగా మార్చి 9 జోన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయరామరాజు అధికారిక ఆదేశాలు జారీచేశారు.
ఇవన్నీ.. పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం అధికారులను, సీఆర్డిఏలో ల్యాండ్ పూలింగు యూనిట్లను విభజిస్తూ సిసిఎల్ఏకు, గ్రామవార్డు సచివాలయ విభాగాలకు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ జోన్లను అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం.. ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్న కొండమరాజుపాలెం రెవెన్యూను సెంట్రల్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈస్ట్ జోన్ పరిధిలోకి కృష్ణాయపాలెం, పెనుమాక వచ్చాయి.
ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి ఐనవోలు, నార్త్ ఈస్ట్ జోన్లోకి లింగాయపాలెం, ఉండవల్లి, వెంకటపాలెం, నార్త్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, మందడం రెండు యూనిట్లు తీసుకొచ్చారు. నార్త్ వెస్ట్ జోన్ పరిధిలో అబ్బురాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, సౌత్ ఈస్ట్‌లోకి నవులూరు 1,2 యూనిట్లు, సౌత్ ఈస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి కురగల్లు రెండు యూనిట్లు, నిడమర్రు రెండు యూనిట్లు కలిపారు.
వెస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలోకి నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుల్లూరు రెండు యూనిట్లు, అనంతవరం గ్రామాలను తీసుకొచ్చారు. అలాగే రెండోదశలో ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందిని నియమించారు. ఒక్కో యూనిట్‌కు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహశీల్దార్, విఆర్ఓ, లైసెన్స్డ్ సర్వేయర్, విలేజ్ సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డిజిటల్ అసిస్టెంట్ను నియమించారు. రాజధాని నగరంలో ల్యాండ్స్ విభాగానికి ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశారు.
ఎందుకు.. ?
ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సమస్యల పరిష్కారం ఇబ్బందిగా మారింది. దీంతో జోన్ల వారీగా ఈ ప్రాంతాన్ని విభజించడంతో జోన్ల పరిధిలోకి వచ్చే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. భూ యజమానులు నేరుగా సిఆర్డిఏ కార్యాలయానికి వెళ్లకుండా ఆయా జోన్ల పరిధిలోని సమస్యలు పరిష్కరించుకునేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా.. అమరావతి రైతులకు మరింత మేలు జరుగుతుందని సర్కారు భావిస్తోంది.
