ఖరీదైన చోరీ: ఎమ్మెల్యే నివాసంలో దుండగుల బీభత్సం
మంగళవారం ఉదయం ప్రమీలాదేవి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు.
By: Tupaki Political Desk | 17 Feb 2026 3:47 PM ISTగుంటూరు పోలీసులకు దొంగలు గట్టి సవాల్ విసిరారు. సామాన్యుల ఇళ్లలో కన్నం వేస్తే పట్టుకుంటారో లేదా అని సందేహించారో ఏమో ఏకంగా ఎమ్మెల్యే ఇంటినే గుల్ల చేశారు. 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకున్నారు. ఈ చోరీ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఒక వైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం విస్తృత చర్చకు దారితీసింది. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పొన్నూరుకు సమీపంలో చింతలపూడి గ్రామంలో ప్రమీలాదేవి నివసిస్తున్నారు. ఆమె ఇంట్లో సుమారు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష నగదును దొంగలు దోచుకున్నారు. ప్రమీలాదేవి చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తున్నారు. అప్పుడప్పుడు పొన్నూరులోని కుమారుడు నరేంద్ర ఇంటికి వెళ్లివస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఆమె పొన్నూరు వెళ్లగా గతరాత్రి తాళం వేసి ఉన్న ఆమె ఇంట్లో దొంగలు చొరపడినట్లు స్థానికులు గుర్తించారు.
మంగళవారం ఉదయం ప్రమీలాదేవి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు. పొన్నూరు నుంచి ఆమె వచ్చి చూడగా, ఇంట్లో ఉంచిన నగలు, నగదు, వెండి ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పొన్నూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు క్లూస్ టీం ను వెంటబెట్టుకుని చింతలపూడిలో ప్రమీలాదేవి ఇంటికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. క్లూస్ టీం నుంచి వేలిముద్రలు సేకరించారు. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగిన వార్త స్థానికంగా సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే ఇంటికే భద్రత లేకపోతే సామాన్యుల సంగతి ఏంటి అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదు చేయగానే పోలీసులు చింతలపూడి చేరుకున్నారు. దొంగలను పట్టుకుని మొత్తం సొత్తు రికవరీ చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ దోపిడీ ఘటన తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల ఇళ్లకే రక్షణ లేకపోతుందనే అంశంపై విపక్షం ప్రశ్నలు లేవనెత్తితే ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుకుంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో పోలీసులు ఈ చోరీ ఘటనను సవాల్ గా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపి దుండగుల కోసం గాలిస్తున్నారు.
