‘అమరావతి’కి పేరు ఎవరు పెట్టారు? సీఎం రివీల్ చేసిన సీక్రెట్!
ఈనాడు అధినేత, దివంగత రామోజీరావు సూచనతో అమరావతి పేరును ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
By: Tupaki Political Desk | 9 April 2026 8:03 PM ISTఏపీ రాజధాని అమరావతికి ఆ పేరు ఎంపిక చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానికి నామకరణం చేసిన వ్యక్తి ఎవరన్నది బహిరంగంగా ప్రకటించారు. ఇన్నాళ్లు రాజధానికి అమరావతి పేరు పెట్టడంపై అనేక రకాల ప్రచారం జరిగింది. కానీ, అమరావతి పేరు ఎవరు ఎంపిక చేశారన్నది మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. ఇక రాజధానిని చట్టంలో చేరుస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అమరావతికి నామకరణం చేసింది ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
రాజధాని ప్రాంతానికి రకరకాల పేర్లు పరిశీలిస్తున్న క్రమంలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సూచనలతో అమరావతి అన్న పేరును ఎంపిక చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనాడు అధినేత, దివంగత రామోజీరావు సూచనతో అమరావతి పేరును ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
రాజధానికి అమరావతి పేరు ఎంపిక చేయడంపై భిన్నమైన వాదనలు వినిపించేవి. ప్రధానంగా దేవత రాజధాని అమరావతి కనుక ఏపీ రాజధానికి ఆ పేరు పెట్టారని ప్రచారం జరిగింది. అదేసమయంలో శాతవాహనుల చారిత్రక రాజధాని, అమరారామ క్షేత్రం, బౌద్ధ స్థూప ప్రాంతం కావడంతో, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను బట్టి అమరావతి పేరును ఎంపిక చేసినట్లు చెప్పేవారు. చారిత్రకంగా ఈ ప్రచారం నిజమైనప్పటికీ గుంటూరు-విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయబోయే రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీరావు సూచించారని సీఎం చెప్పడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
రాజధాని అమరావతి విషయంలో విపక్షం వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న ప్రాంతాన్ని రాజధాని రీజియన్ గా ప్రకటించాలని, దీనికి మావిగన్ అన్న పేరు పెట్టాలని వైసీపీ చెబుతోందని చంద్రబాబు ఎత్తిచూపారు. ప్రస్తుతం సీఆర్డీఏ ప్రాంతం అంతా రాజధాని కిందకే వస్తుందని, సీఆర్డీఏ అంటేనే రాజధాని ప్రాంతమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రాంతానికి అమరావతిగా పేరు పెట్టామని, ఆ పేరు ప్రస్తావించడానికి ఇష్టం లేకనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మావిగన్ అంటూ వింత మాటలు మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
