లక్ష ఎకరాలకు పాకుతున్న అమరావతి రాజధాని!
అమరావతి ప్రపంచ రికార్డు రాజధానిగా మారబోతుంది. ఏకంగా లక్ష ఎకరాల మేర అమరావతి రాజధానిగా రాబోతోంది.
By: Tupaki Desk | 14 April 2025 10:19 AM ISTఅమరావతి ప్రపంచ రికార్డు రాజధానిగా మారబోతుంది. ఏకంగా లక్ష ఎకరాల మేర అమరావతి రాజధానిగా రాబోతోంది. ఇలా ఊహలకు అందని విధంగా అమరావతిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
అమరావతి రాజధాని కోసం 2014 నుంచి 2019 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏకంగా 34 వేల ఎకరాలను సేకరించింది. అది కూడా అక్కడ ఉన్న 29 గ్రామాలలో రైతులతో సంప్రదింపులు జరిపి చాలా సాఫీగానే ఈ వ్యవహారం చేశారు. నిజంగా ఇది ప్రపంచంలోనే కొత్తగా ప్రయోగాత్మకంగా జరిగిన అతి పెద్ద భూ బదలాయింపు అని అంతా మెచ్చుకున్నారు.
ఎందుకంటే భూములు అభివృద్ధి కోసం ప్రజల నుంచి తీసుకోవడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. దాని మీద కోర్టులకు వెళ్తారు. అపుడు యుగాలు జగాలు అవుతుంది. కానీ ఏ విధమైన వివాదం లేకుండా వేల ఎకరాలు సేకరించడం అంటే మాటలు కాదు.
అది చంద్రబాబు మీద నమ్మకంతో ఇచ్చారు అని అంతా మెచ్చుకున్నారు. నిజంగా అదే వాస్తవం కూడా అని అంతా అన్నారు. సరే మధ్యలో అయిదేళ్ళ వైసీపీ ప్రభుత్వం హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోయాయి. దాంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి రాగానే మొదట ప్రాధాన్యతగా అమరావతి రాజధానినే పెట్టుకుంది.
దాని కోసం నిధుల సేకరణ కూడా చేసింది. కేంద్ర సాయం కూడా తీసుకుంది. మొత్తానికి 45 వేల కోట్ల రూపాయల దాకా నిధులు సమకూరాయి. మొదటి దశ పనులు అమరావతిలో సేకరించిన 34వేల ఎకరాల భూముల్లో ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మొదలవుతాయి.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే అమరావతి రాజధాని కోసం కోర్ క్యాపిటల్ కాకుండ అవతల మరో 44 వేల ఎకరాల భూములను సేకరించాలని. ఇది నిజంగా బృహత్తర కార్యక్రమం గానే ఉంది.
కోర్ క్యాపిటల్ దాటి మరింతగా అభివృద్ధి చేయాలీ అంటే ఈ భూముల అవసరం పడుతుంది అన్నదే ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది. ఈ 44 వేల ఎకరాల భూములలో అమరావతి రాజధానికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అలాగే విమానాశ్రయం, రైల్వే లైన్లు వంటివి ఏర్పాటు చేస్తారు. ఇక అందులోనే పారిశ్రామికవేత్తలకు కూడా సంస్థలు ఏర్పాటు చేసేందుకు భూములను ఇస్తారు. అంటే కోర్ క్యాపిటల్ లో చేసిన డిజైన్లు అభివృద్ధితో పాటుగా మరింత అదనంగా ఈ డెవలప్మెంట్ ఉంటుంది అన్న మాట.
మరి ఈ విధంగా 44 వేల ఎకరాలను సేకరించాలని సీఆర్డీయేకు బాధ్యతలు అప్పగించారు. ఈ 44 వేల ఎకరాలను తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాలలో నుంచి సేకరిస్తారు. ఇందులో తుళ్ళూరు మండలంలోని హరిశ్చంద్రాపురం, వడ్లమాను, పెదపరిమి వంటి గ్రామాలలో 9919 ఎకరాలను సేకరిస్తారు.
అదే విధంగా అమరావతి మండలంలోని వైకుంఠాపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడమొక్కల గ్రామాలలో 12,838 ఎకరాలను సేకరిస్తారు. తాడికొండలోని తాడికొండ, కంతేరు గ్రామాలలో 16 వేల 463 ఎకరాలను సేకరిస్తారు. ఇక మంగళగిరిలోని కాజా గ్రామంలో 4492 ఎకరాల భూమిని సేకరించనుంది.
వీటికి సంబంధించి భూసేకరణ నోటీసుని రెండు మూడు రోజులలో సీఆర్డీఏ అధికారులు రిలీజ్ చేస్తారు. మరి ఈ భూములను ఏ విధంగా సేకరిస్తారు, తమ భూములను ఇచ్చేందుకు రైతులను ఎలా ఒప్పిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఈ విధంగా 44 వేల ఎకరాలను సేకరిస్తే మాత్రం కూటమి అమరావతి రాజధానిని దాదాపుగా లక్ష ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్లు అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి కూడా వేల ఎకరాలు ఉంది. దానిని కూడా కలుపుకుంటారు అని అంటున్నారు. మరి లక్ష ఏకరాలతో అమరావతి అంటే ప్రపంచ రికార్డే అవుతుంది.