Begin typing your search above and press return to search.

లోక్ సభలో అమరావతి.. రాజధానికి మరో గుర్తింపు!

ఏపీలో కొత్తగా ఆవిర్భవించే పార్లమెంటు నియోజవర్గాల్లో ‘అమరావతి’ పేరుతో కూడా నియోజకవర్గం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   17 April 2026 10:18 PM IST
లోక్ సభలో అమరావతి.. రాజధానికి మరో గుర్తింపు!
X

ఏపీలో కొత్తగా ఆవిర్భవించే పార్లమెంటు నియోజవర్గాల్లో ‘అమరావతి’ పేరుతో కూడా నియోజకవర్గం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఇటీవల రాష్ట్ర రాజధానిగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పుడు రాజధాని నగరం లోక్ సభ నియోజకవర్గంగా మారనుందనే సమాచారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అమరావతి ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తున్న కొన్నివర్గాలకు ఈ పరిణామం రుచించకపోవచ్చునని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా అమరావతి చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం మరోసారి రాజధానికి పట్టం కట్టేలా నిర్ణయం తీసుకుంటుందనే సమాచారం హాట్ టాపిక్ గా మారుతోంది.

కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ తో ఏపీలో అదనంగా 13 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ఒక నియోజకవర్గాన్ని అమరావతి పేరుతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, కేంద్ర పెద్దలు కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు పార్లమెంటు ఆమోదించిన వెంటనే ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించే నియోజకవర్గాలపై విస్తృత చర్చ జరుగుతోంది.

2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రాష్ట్రంలో బొబ్బిలి, పార్వతీపురం, తెనాలి పార్లమెంటు నియోజకవర్గాలు ఉండేవి. తెనాలి నియోజకవర్గం బాపట్లగా మారడంతోపాటు ఎస్సీ రిజర్వుడు అయింది. ఇక అంతకుముందు కూడా రాష్ట్రంలో మార్కాపురం, చీపురుపల్లి, పాతపట్నం, గుడివాడ వంటి ప్రాంతాలు పార్లమెంటు నియోజకవర్గాలుగా ఉండేవని చెబుతున్నారు. కొత్తగా పునర్విభజన చేపడితే ఈ పాత నియోజకవర్గాల్లో కొన్ని మళ్లీ నియోజకవర్గ కేంద్రాలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా రాజధాని అమరావతి పేరుతో లోక్ సభ నియోజకవర్గం ఏర్పాటు ప్రతిపాదనపై విస్తృత చర్చ జరుగుతోంది. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తుండటం వల్ల అమరావతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీలు ఏవేవి? అని కూడా చర్చించుకుంటున్నారు.

డీలిమిటేషన్ తో రాష్ట్రంలో కొత్తగా 13 నియోజకవర్గాలు ఏర్పడితే, ఇందులో ఎక్కువగా జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని లోక్ సభ నియోజకవర్గాలు సుమారు 13 లక్షల ఓటర్లు ఉంటే, కొన్ని దాదాపు 20 లక్షల ఓటర్లతో ఉన్నాయని అంటున్నారు. ఇలా ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఒంగోలు వంటి పార్లమెంటు నియోజకవర్గాలను పక్క నియోజకవర్గాలతో కలిపి రెండు లేదా మూడు చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ప్రాంతంలో కొత్త లోక్ సభ నియోజకవర్గం రావొచ్చని, దానికి అమరావతి పేరు పెడతారని చెబుతున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో రెండు నియోజకవర్గాలు ఉండగా, విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు నగరాలకు సమీపంలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు మచిలీపట్నం, నరసారావుపేట వంటి నియోజకవర్గాల్లో ఉన్నాయి. దీంతో ఈ రెండు నగరాల పరిధిలో ఉన్న నియోజకవర్గాలు, సమీపంలో ఉన్న అసెంబ్లీ స్థానాలను పునర్విభజించి మొత్తం మూడు లోక్ సభ స్థానాలు చేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.