అడ్డం తిరుగుతున్న అమరావతి రైతు.. కారణం వైసీపీనే..?
అయితే చంద్రబాబు 4.O ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అమరావతిని తిరిగి పట్టాలెక్కించారు. ప్రపంచబ్యాంకు, జర్మన్ బ్యాంకు, హడ్కో నుంచి వేల కోట్లు నిధులు సేకరించారు.
By: Tupaki Desk | 4 July 2025 11:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి విస్తరణకు రైతులు బ్రేకులు వేస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మించాలన్న ఆశయం పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి సుమారు 34 వేల ఎకరాలను సమీకరించిన విషయం తెలిసిందే. ఈ భూమి అదనంగా ప్రభుత్వ, పోరంబోకు, బంజరు భూములు అన్నీ కలిపి ప్రస్తుతం దాదాపు 50 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో నవ నగరాలు నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే 2014-19 మధ్య ఈ పనులు పూర్తి కాకపోవడం, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని అటకెక్కించడం వివాదాస్పదమైంది.
అయితే చంద్రబాబు 4.O ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అమరావతిని తిరిగి పట్టాలెక్కించారు. ప్రపంచబ్యాంకు, జర్మన్ బ్యాంకు, హడ్కో నుంచి వేల కోట్లు నిధులు సేకరించారు. అదే సమయంలో అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అదనపు హంగులు అద్దాలని భావించారు. కొత్తగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఏఐ సిటీ, స్పోర్ట్స్ విలేజ్, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం అదనంగా 44 వేల ఎకరాలను మరోమారు సమీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అయితే సీఎం ప్రతిపాదనపై అంత సానుకూలత కనిపించడం లేదని తాజా సంఘటనలు వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క పిలుపుతో వేల మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి 34 వేల ఎకరాల భూములను రైతులకు అప్పగించారు. అయితే ఇప్పుడు అమరావతి చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో 44 వేల ఎకరాలను సమీకరించాలని భావించినప్పటికీ కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సేకరించిన భూములను అభివృద్ధి చేయకపోవడం, గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానంతో తాము భూములిచ్చి నష్టపోలేమని రైతులు తెగైసి చెబుతున్నారు. ఇప్పుడు మీరు భూములు తీసుకుంటే, రేపు వచ్చే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్న గ్యారెంటీ ఏంటని నిలదీస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ రాదని గ్యారెంటీ ఇస్తే భూములు ఇస్తామని కొందరు రైతులు ప్రశ్నిస్తుండటంతో మంత్రులు బిత్తరపోతున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రైతుల నుంచి 44 వేల ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైన ప్రభుత్వం గురువారం నుంచి మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో గ్రామ సభల నిర్వహణకు సిద్ధమైంది. ఈ గ్రామసభలలోనే రైతులు తీర్మానం చేసి ప్రభుత్వానికి భూములు అప్పగించాల్సివుందని అంటున్నారు. అయితే కొందరు రైతులు ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు ఇస్తున్నప్పటికీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే తాము నష్టపోతామనే భయంతో కొందరు రైతులు భూములు ఇవ్వమని మొండికేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామసభలకు వచ్చిన మంత్రుల ముఖం మీదే చెప్పేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి రాదని గ్యారెంటీ ఇవ్వాలని కొందరు మంత్రులను ప్రశ్నించారు. రైతుల మాటలకు మంత్రులు షాకైనట్లు చెబుతున్నారు. రైతుల భూములకు చంద్రబాబు హామీగా ఉంటారని మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మంత్రులు రైతులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రెండో విడత భూ సమీకరణ అంత సులువేమీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు భూ సమీకరణకు ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండో విడత భూ సమీకరణపై జనసేన, బీజేపీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ రెండు పార్టీలు కూడా కలిసివస్తే ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు భుజాలపై వేసి చూస్తూ ఉండటం కరెక్టు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.