Begin typing your search above and press return to search.

అమరావతికి అదనపు భూ సేకరణ.. వణుకుతున్న టీడీపీ కేడర్!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టింది.

By:  Tupaki Desk   |   29 April 2025 11:00 PM
అమరావతికి అదనపు భూ సేకరణ.. వణుకుతున్న టీడీపీ కేడర్!
X

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న వేళ.. అదనపు భూ సమీకరణపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనతో టీడీపీ నేతల్లో గుబులు రేగుతోందని ప్రచారం జరుగుతోంది. పదేళ్ల క్రితం రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న 34 వేల ఎకరాలు సరిపోదని కొత్తగా మరో 44 వేల ఎకరాలు సమీకరించడానికి చేస్తున్న ప్రయత్నంతో అసలుకే ఎసరు వస్తుందనే భయం టీడీపీ కేడర్ లో కనిపిస్తోందని అంటున్నారు. ఇదే విషయమై రాజధాని రైతుల్లోనూ అనుమానాలు ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని పిలిచిపించి మాట్లాడారు. కానీ, వారి అభ్యంతరాలు వినకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాల్సినది ఏదో చెప్పారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. వేల కోట్ల నిధులు సేకరించడంతోపాటు పనులకు టెండర్లు పిలిచి, కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించి రాజధానిని పట్టాలెక్కిస్తోంది. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఈ జోష్ ఇలా కొనసాగించివుంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండేది కాదని అంటున్నారు. పదకొండు నెలలుగా పనులు మొదలుకాకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా మరింత భూమి కావాలని సంప్రదింపులు మొదలు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తొలుత సమీకరించిన భూమిని అభివృద్ధి చేయకుండా కొత్తగా మళ్లీ భూ సమీకరణ అంటుండటంపై తెలుగుదేశం నేతలు వణికిపోతున్నారు. ఈ విషయంలో పార్టీ పునరాలోచన చేయకపోతే విపక్షానికి స్వయంగా అస్త్రం ఇచ్చినవారు అవుతామని పలువురు సీనియర్ నేతలు మదనపడుతున్నారు. అయితే తమ ఆలోచనలను పార్టీలో ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాక అంతర్గత సమావేశాల్లో తోటివారితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ తమ ఫోకస్ మొత్తం రాజధానిపై పెట్టారని అంటున్నారు. వారి ప్రయత్నాలను స్వాగతిస్తున్న నేతలు.. కొత్తగా సమీకరణ అన్న విషయాన్ని మాత్రం ఆమోదించలేకపోతున్నారని అంటున్నారు. ఈ విషయమై రాజధాని రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజధానికి సమీపంలో గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, కొత్తగా మరో విమానాశ్రయడం కడతామనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కడతామనే తమ ప్రతిపాదనకు ఉమ్మడి రాష్ట్రంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదహరిస్తున్నారు. అయితే హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాలకు శంషాబాద్ విమానాశ్రయానికి సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ మరో విమానాశ్రయం లేకపోవడం వల్ల అంతదూరంలో కట్టడం, హైదరాబాద్ నగరం అటువైపు విస్తరించడంతో అభివృద్ధి చెందిందనే అభిప్రాయం ఉంది. కానీ, రాజధాని అమరావతికి గన్నవరం కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా రాజధానితోపాటు గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి గతంలో భూమి సమీకరించారు.

అమరావతిని దృష్టిలో పెట్టుకునే గతంలో గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విమానాశ్రయం ఉండగా, మరో విమానాశ్రయం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని నగరం ఇంకా రూపుదిద్దుకోలేదు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా తొలి అడుగు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న భూమి అభివృద్ధి చేయకుండా, కొత్తగా సమీకరణ అంటూ భారం పెంచుకోవడం ఎందుకని? టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అయితే అధిష్ఠానం వద్ద భయంతో ఎవరూ బహిరంగంగా నోరువిప్పడం లేదని అంటున్నారు. ముందుగా గతంలో సేకరించిన 34 వేల ఎకరాలను అభివృద్ధి చేసి ఆ తర్వాత అదనపు భూమిని సమీకరిస్తే బాగుంటుందని అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అన్నట్లు ఈ విషయాన్ని అధినేత చంద్రబాబుకు చెప్పే సాహసం ఎవరూ చేయడం లేదని అంటున్నారు.