అమరావతిలో అదనపు భూ సమీకరణా ఎందుకు? చంద్రబాబు ఆలోచన ఇదే..
అమరావతిలో అదనంగా 44 వేల ఎకరాల భూమిని సమీకరించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా స్పందించారు.
By: Tupaki Desk | 13 Sept 2025 9:00 PM ISTఅమరావతిలో అదనంగా 44 వేల ఎకరాల భూమిని సమీకరించాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ప్రస్తుతం సేకరించిన 34 వేల ఎకరాలతోపాటు ప్రభుత్వ, బంజరు భూములు అన్నీ కలిపి సుమారు 50 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న 50 వేల ఎకరాలతోపాటు అదనంగా 44 వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయమై చాలా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ప్రభుత్వం.. అవసరం మేరకే అదనపు భూమి సమీకరిస్తామని చెప్పింది. అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ విలేజ్ కోసం 12 వేల ఎకరాలు కావాలని రైతులను సంప్రదించింది.
అయితే ఈ అదనపు భూ సమీకరణపై ఇంటా బయట ఎన్నో విమర్శలు వచ్చినా, ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదు. బహిరంగంగా ఈ విషయమై ఎక్కడా మాట్లాడలేదు. అదే సమయంలో రాజధాని రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న సమాచారంతో అదనపు భూ సమీకరణపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఆత్మరక్షణలో పడిందనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో ఈ అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టతనిచ్చారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తున్న అమరావతి భవిష్యత్తులో ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో అదనపు భూమిని సమీకరించాలని ఆలోచించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో ప్రతిపాదిక ప్రాజెక్టులు అన్నీ పూర్తయితే, భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు భూమి అందుబాటులో ఉండదని, అప్పుడు అభివృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు వివరించారు.
హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందడానికి సైబరాబాద్ గా నిర్మించిన ప్రాంతంలో భూమి అందుబాటులో ఉండటమే కారణంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం క్వాంటం వ్యాలీ, డ్రోన్, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీలకు అమరావతిని కేంద్ర స్థానంగా చేస్తున్నందున భవిష్యత్తులో ఈ రంగానికి చాలా భూమి అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాలకు భూమి సిద్ధంగా లేకపోతే.. ప్రైవేటు భూములు ధరలు పెరిగి ఆయా సంస్థలు పెట్టుబడులకు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే తగినంత భూమి అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికతో అదనపు భూ సమీకరణకు వెళ్లినట్లు సీఎం చెబుతున్నారు.
ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలతో రాజధాని రైతుల ఆలోచన మారుతుందా? అన్న చర్చ మొదలైంది. ఇప్పటివరకు అదనపు భూ సమీకరణపై ముఖ్యమంత్రి ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. రైతులు వద్దన్నప్పుడు అదనపు సమీకరణ అవసరమంటూ మొండిగా వాదిస్తే లేనిపోని వివాదాలకు తెరలేపినట్లుగా భావించిన సమయం తగిన సమయం కోసం వేచిచూసి ఇప్పుడు తన అభిప్రాయాన్ని బయటపెట్టారని అంటున్నారు. భవిష్యత్తులో విశ్వనగరంగా అమరావతి ఎదగాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమితోపాటు పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి వరకు అమరావతిని విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
