అమరావతి రాజధాని : పదే పదే అదే మాట వద్దే వద్దు !
ఒక జర్నలిస్ట్ ఒక టీవీ చానల్ డిబేట్ లో ఏపీ రాజధాని మీద అనుచితంగా మాట్లాడారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:16 AM ISTఒక జర్నలిస్ట్ ఒక టీవీ చానల్ డిబేట్ లో ఏపీ రాజధాని మీద అనుచితంగా మాట్లాడారు. ఆయన అన్నది అతి పెద్ద తప్పు. దానికి గానూ ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అలా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడితే ఏపీకి ఏపీ బ్రాండ్ ఇమేజ్ గా మారబోతున్న అమరావతి రాజధానికి ఎంతో మన్నన, మర్యాద.
అయితే జరుగుతున్నదేంటి అంటే అమరావతి మీద ఒక చానల్ డిబేట్ లో సదరు జర్నలిస్ట్ ఏమన్నారో ఎవరికీ పెద్దగా తెలియదు. అతి కొద్ది మంది మాత్రమే అది విన్నారు. కానీ దానిని గత కొద్ది రోజులుగా అతి పెద్ద చర్చగా మార్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా నుంచి ప్రతీ వేదిక మీద అదే పదాన్ని పదే పదే అనడం ద్వారా రాజధాని బ్రాండ్ ఇమేజ్ కి అంత మంచిది కాదు అని అంటున్నారు.
అన్నది ఎవరో ఒక జర్నలిస్టు. విన్నది కూడా ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇపుడు ఇంత పెద్ద చర్చలు పెట్టడం ద్వారా అందరికీ దీని మీద వివరంగా విపులంగా చెప్పడం వల్ల అమరావతికి లాభం కంటే చేటు తెస్తున్నామా అన్నది అంతా ఆలోచించాలని అంటున్నారు.
ఏపీ రాజధాని విషయంలో ఇంత రచ్చ దేశంలో ఏ రాజధాని విషయంలోనూ లేదు. ఇది గత పదకొండేళ్లుగా నాన్ స్టాప్ గా సాగుతోంది. రాజకీయంలో పడి రాజధాని నలుగుతోంది. అయితే ఇపుడు మరింత దిగజారుడు వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలతో ఇంకా దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోంది.
ఈ కీలక సమయంలో అమరావతి రాజధాని ప్రేమికులు అయిన వారు కోరుకునేది ఏంటి అంటే ఈ అనుచితమైన వ్యాఖ్యలను ఇక రిపీట్ చేయవద్దు అని . ఇది ఇక్కడితో ముగించడమే ఏపీకి రాజధానికి అందరికీ మేలు అని. రాష్ట్రం బయట కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఇది మరింతగా ప్రచారం అయితే ఇబ్బంది పడేది ఏపీనే అన్నాది గుర్తెరిగి అంతా ఇకనైనా ఈ తరహా డిబేట్లకు ఫుల్ స్టాప్ పెడితే మేలు అని అంటున్నారు.
ఇక తప్పు ఎవరు చేసినా చట్టం ఉంది. చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది. ఆ విధంగా ఎవరు నోరు జారినా ఎవరు విషం కక్కినా తగిన చర్యలు ఉంటాయన్న సందేశాన్ని పంపించాలి. అంతే తప్ప వేరే విధంగా ఈ చర్చను తీసుకేళ్ళడం వల్ల రాజకీయంగా బాగుంటుందేమో కానీ రాష్ట్రానికి అమరావతి రాజధానికి అది ఏ మాత్రం మేలు చేయదనే రాష్ట్ర అభిమానులు అంటున్నారు.
అంతే కాదు తెలియని వారికి కూడా తెలియచేస్తూ ఆ బురద మాటలను అందరి చెవులలోకి దూరేలా చేస్తూ మరింతగా ఇబ్బంది పెట్టడం ఎవరికీ భావ్యం కాదనే సూచనలు వస్తున్నాయి. సో అమరావతి అందరి రాజధాని ఆంధ్రుల రాజధాని. ఈ మాటలనే ఎవరైనా పదే పదే ప్రమోట్ చేస్తూ ఈ దిశగా పాజిటివ్ కోణంలో డిబేట్లు పెడితే ఎంతో లాభం అని అంటున్నారు.