Begin typing your search above and press return to search.

హైదరాబాద్ కన్నా అతిపెద్ద నగరంగా అమరావతి!

రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2025 11:30 AM
Amaravati is a bigger city than Hyderabad
X

రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ప్రస్తుతం 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తున్నారు. దీనిపూర్తి వైశాల్యం 217.23 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రస్తుత హైదరాబాద్ జిల్లా విస్తీర్ణంతో సమానం. విభజిత రాష్ట్రంలో హైదరాబాద్ అంత పెద్ద నగరం రాజధానిగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు 54 వేల ఎకరాలను సేకరించాలని గతంలో నిర్ణయించారు. అయితే అప్పట్లో ఎదురైన సవాళ్లతో 33 వేల ఎకరాలకు కుదించి సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రాజధాని అమరావతిలో వివిధ సంస్థలు ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా, విమానాశ్రయం, రైల్వేలైన్, మెట్రో వంటి కోసం అదనంగా భూమి అవసరం ఏర్పడింది. ఇదే సమయంలో కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు స్వయంగా ఆసక్తిచూపుతున్నారు. దీంతో రాజధాని అమరావతిని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది.

రాజధాని అమరావతి విస్తీర్ణం కాబోతోందని, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. ఇందుకోసం సీఆర్డీఏ వెలుపల ఉన్న గ్రామాల్లోనూ ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రాథమికంగా సేకరించారని అంటున్నారు. గతంలో రాజధానికి భూమిని ఇవ్వడానికి వ్యతిరేకించిన వారు ఇప్పుడు మనసు మార్చుకున్నారని, తమ గ్రామాల్లో భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. దీంతో రాజధానికి మరో 44 వేల ఎకరాలు సమకూరితే హైదరాబాద్ నగరాన్ని మించిన సిటీ రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజధాని అమరావతిని మూడేళ్లలోగా నిర్మించాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనుల ప్రారంభానికి సరైన ముహూర్తం చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃనిర్మాణ పనులు స్టార్ట్ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రాజధాని కోసం మరో 44 వేల ఎకరాలను సేకరించాలనే ప్రతిపాదన ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో మొత్తం 92 ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందుకోసం రూ.65 వేల కోట్లు నిధులు అవసరమని అంచనా వేస్తోంది. ఈ నిధుల్లో దాదాపు సగం మొత్తం ఇప్పటికే ప్రభుత్వం సమీకరించింది. దీంతో రాజధాని పనులు ప్రారంభానికి ఎలాంటి ఆటంకం లేదని చెబుతున్నారు. అయితే రాజధాని నగరానికి అదనపు హంగులు అద్దడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి చాలదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా అమరావతి పురోగతికి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఇందుకోసం 5 నుంచి 7 వేల ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమిలో విమానాశ్రయం నిర్మాణానికి భూమి కేటాయించే పరిస్థితి లేకపోవడంతో సమీప గ్రామాల నుంచి ఆ భూమి తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

అదేవిధంగా అమరావతి రైల్వేలైన్, అంతర్జాతీయ స్టేడియం, మెట్రో రైలు ఇలా చెప్పుకుంటే పోతే భవిష్యత్తు అవసరాలకు మరింత భూమి అవసరం అంటున్నారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం నవ నగరాలకు సరిపడా భూమి సిద్ధంగానే ఉన్నా, కొన్ని అంతర్జాతీయ సంస్థలు రాజధానిలో భూమిని అడుగుతుండటంతో డిమాండ్ పెరిగిపోయింది. అమరావతిని బెంగళూరు తరహాలో దేశంలోనే టాప్‌-10 రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో ప్రజల నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రూప్‌ హౌస్‌లు, హైరైజ్‌ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

అమరావతి విస్తరణ కోసం తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలో మొత్తం 11 గ్రామాల్లో 18,080 హెక్టార్లు అంటే సుమారు 44,670 ఎకరాలు భూములు సమీకరించాలని అనుకుంటోంది. కోట్ల విలువ చేసే ఈ భూములను సమీకరణ చేయడం అంటే ప్రభుత్వానికి చాలా భారం. అదే ప్రజలకు భాగస్వామ్యం కల్పించి సమీకరిస్తే ఉభయ తారకంగా ఉంటుందని అంటున్నారు. దీంతో తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి, అమరావతి మండలం వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, మోతడక, నిడుముక్, తాడికొండ మండలం తాడికొండ, కంతేరు, మంగ ళగిరి మండలం కాజ గ్రామాల్లో భూ సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు.