అమరావతి టు అమెరికా విమానం ఎప్పుడంటే..?
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు అవసరం అవుతాయని ఇటీవల ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి టు అమెరికా విమానం ఇష్యూ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 29 May 2025 7:00 PM ISTఅమరావతి అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని.. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు అవసరం అవుతాయని ఇటీవల ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి టు అమెరికా విమానం ఇష్యూ తెరపైకి వచ్చింది.
అవును... దేశంలోనే అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారీ ఎత్తున ప్లాన్స్ వేస్తున్నారు. ఈ సమయలో అమరావతిలో సుమారు 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. ఈ సమయంలో.. అమరావతి టు న్యూయార్క్ (అమెరికా) కు విమానం అంశం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా.. విజయవాడ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై వెళ్లేవారిలో విదేశాలకు ఎంతమంది వెళ్తున్నారు.. అందులో అమెరికాకు వెళ్లేవారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలు అధికారులు సేకరిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో 350 - 400మంది కెపాసిటీ ఉన్న సర్వీసు నడిపితే రోజూ ఆదరిస్తారా, ఈ మేరకు ఎయిర్ లైన్స్ సంస్థలు ముందుకు వస్తాయా అనే విషయంపై అధికారులు దృష్టిపెట్తారని అంటున్నారు.
కాగా... ఇప్పటికే గన్నవరం (విజయవాడ)లో విమానాశ్రయం ఉన్నందున మళ్లీ అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమా అనే చర్చ మొదలైందని అంటున్న వేళ.. దీనిపై మంత్రి నారాయణ ఇప్పటికే సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయం ఉన్నా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించిన విషయాన్ని ప్రస్థావించారు.
హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్ పోర్ట్ ఉన్నా అప్పట్లో చంద్రబాబు శంషాబాద్ లో మరొకటి నిర్మించేందుకు 5 వేల ఎకరాలు సేకరించారని.. ఈ ఎయిర్ పోర్ట్ లేకపోతే బేగంపేటలో ఇప్పుడు 10% విమానాలు కూడా దిగేందుకు అవకాశం ఉండేది కాదని.. చంద్రబాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
