Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకో.. అమరావతి టు హైదరాబాద్ రూటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దీంతో తాజాగా విభజన హామీలపై సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   9 April 2025 5:36 PM IST
Amaravati-Hyderabad Expressway Gets Central Approval
X

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరో తీపికబురు చెప్పింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానించేలా ఓ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత ప్రతిపాదనే అయినా, దాదాపు పదేళ్ల తర్వాత పట్టాలపైకి వస్తుండటంతో అమరావతికి బిగ్ బోనంజాగా భావిస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేని ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాజాగా విభజన హామీలపై సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేకి పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతికి డైరెక్ట్ యాక్సెస్ లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరు వచ్చి ఆ నగరాల మీదుగా రాజధాని అమరావతికి వెళ్లాల్సివుంటుంది. ప్రధానంగా హైదరాబాద్-విజయవాడ ఎక్స్ ప్రెస్ వేగా చెప్పే NH 65ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మహారాష్ట్రలోని పుణే నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు విస్తరించిన ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటోంది. దీంతో కొత్త రాజధాని నగరానికి హైదరాబాద్ నుంచి ఇంకో రోడ్డు వేయాలని గతంలోనే ప్రతిపాదన వచ్చింది.

రాష్ట్ర విభజన హామీల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 3న విభజన హామీల్లో పరిష్కారంకాని వాటిపై కేంద్రం సమీక్షించింది. ఇందులో 15 శాఖల అధికారులు హాజరుకాగా, సుదీర్ఘ సమావేశం జరిగింది. కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ అధికారులతోపాటు బొగ్గు గనులు, ఉక్కు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే శాఖలపై సమీక్షించారు. విభజన హామీల్లో భాగంగా ఇప్పటకే విశాఖలో రైల్వే జోన్ ప్రక్రియ మొదలు కాగా, కీలకమైన గ్రీన్ ఫీల్డ్ హైవేకి కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నవ్యాంధ్ర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ - అమరావతి మధ్య ఆటంకం లేని ప్రయాణానికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల అమరావతికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాజధాని అమరావతికి పెట్టుబడులు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం ప్రకటించిన తాజా ప్రాజెక్టు మరింత శక్తినిచ్చిందని అంటున్నారు.