అమరావతి రాజధానికి గెజిట్...2029లో వైసీపీ గెలిస్తే ?
అమరావతి చట్టబద్ధత వచ్చేసింది రాష్ట్రపతి ఆమోదముద్రతో రాజ పత్రం జారీ చేశారు. ఇది నిజంగా అమరావతికి ఒక చట్టబద్ధమైన రక్షణ.
By: Satya P | 7 April 2026 11:42 AM ISTఅమరావతి చట్టబద్ధత వచ్చేసింది రాష్ట్రపతి ఆమోదముద్రతో రాజ పత్రం జారీ చేశారు. ఇది నిజంగా అమరావతికి ఒక చట్టబద్ధమైన రక్షణ. ఈ విధంగా అమరావతి ఒక రికార్డుని సాధించింది. చిత్రమేంటి అంటే ఏ రాష్ట్రానికీ దాని రాజధానికీ ఈ రకమైన చట్ట బద్ధత అన్నది ఇంతవరకూ లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలకూ రాజధానులు ఉన్నాయి కానీ చట్టబద్ధత లేదు, కానీ ఒకే ఒక్క రాజధాని అమరావతికి మాత్రం ఆ కీర్తి తన కిరీటంలో చేరింది. దాంతో అమరావతి వెరీ స్పెషల్ అయింది. ఈ స్పెషాలిటీ ఇక్కడితో ఆగుతుందా ఇంకా ఏమైనా రాజకీయ తమాషాలు ఉన్నాయా అన్నదే మేధావులతో పాటు అందరిలో చర్చగా ఉంది.
రాజ్యాంగం లో ఏముంది :
ఇదిలా ఉంటే భారత రాజ్యాంగం రాష్ట్రాలకు రాష్ట్ర రాజధాని అనే పదాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజధాని ఎక్కడ ఉంచాలనే విషయంలో ఒక చట్టపరమైన రాజ్యాంగ నిశ్శబ్దం ఇక్కడ నెలకొని ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజధానుల ఎంపిక బాధ్యత అన్నది రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటూ వస్తున్నాయి. ఆ విధంగా శాసన అధికారం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనా స్థలాన్ని గుర్తించడం ద్వారా తమ రాజధానులను నిర్వచిస్తాయి. ఇక ఏపీ విషయం మాత్రం కొంత ప్రత్యేకంగా ఉంది 2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ని రెండుగా విభజించినపుడు హైదరాబాద్ పదేళ్ళ పాటు ఏపీకి ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. దాంతో పార్లమెంట్ లో విభజన చట్టానికి సవరణ చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్న స్థానంలో అమరావతి అని చేర్చారు. ఆ మీదట పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది.
అనేక డౌట్లతో :
అయితే రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని ప్రస్తావన లేనందున దానిని ఏర్పాటు చేయడానికి లేదా మార్చడానికి ప్రత్యేక చట్టం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. పైగా అసెంబ్లీ ద్వారానే ఈ మార్పులు చేర్పులు సాధ్యమని ఆయన అంటున్నారు. అమరావతి ఏపీకి రాజధాని అని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అదే తీర్మానం రేపు మరో ప్రభుత్వం కూడా చేసి రాజధాని విషయంలో మార్పులు చేయలేరా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఆయన చెప్పినది కరెక్ట్ అనే అంటున్నారు. ఇక మరో విషయం ఉంది. రాజధానులు ఎంపిక రాష్ట్రాల పరిధిలో ఉంది. దాంతో కేంద్రం సైతం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రకాం పార్లమెంట్ లో మార్పులు చేస్తుందా అంటే దానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు నిపుణులు
రాజకీయ వ్యూహాలేనా :
రాజ్యాంగం ఏమి చెప్పింది రాజధానులు వాటి చట్టబద్ధత అన్నది కాసేపు పక్కన పెడితే రాజకీయాలు వ్యూహాలే ఈ విషయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కూడా అంతా అంటున్నారు. ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏపీ నుంచి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంది. దాంతో టీడీపీ కోరుకున్నది నెరవేరుతోంది. మరి 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీ ఎంపీలు హెచ్చు సంఖ్యలో గెలిచి కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతుకు బలంగా నిలబడితే అపుడు పరిస్థితి ఏమిటి అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. అపుడు గెజిట్ నోటిఫికేషన్ సంగతి ఏమిటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
కీలక ప్రశ్నలే :
రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉన్న వేళ రేపటి రోజున కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ ఎంపీలు కీలకమైతే అమరావతి గెజెట్ లో మార్పులు చేర్పులు చేస్తారా అది సాధ్యమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే దీనికి ఎంత వరకూ అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అది ఒకటి రాజ్యాంగ ప్రకారంగా ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ తీర్మానం ఇస్తే దానికి పార్లమెంట్ ఆమోదించి చట్ట సవరణ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం. రెండు రాజకీయ అవసరాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల రేపటి రోజున ఈ గెజిట్ లో మార్పులు అంటే ఏమైనా జరగవచ్చా అంటే ఆస్కారం లేదని ఎవరూ కొట్టి పారేయడం లేదు, రాజకీయ విశ్లేషకులు అయినా రాజ్యాంగ నిపుణులు అయినా ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు.
నైతికత ముఖ్యం :
ఇక నైతికత ఒకటి ఉంటుంది. అంతే కాదు ప్రజా కోణం కూడా ఉంటుంది. ఎంతసేపూ రాజ్యాంగం రాజకీయం మాత్రమే ఏ నిర్ణయం అయినా మార్పులు చేర్పులూ చేయలేవు, నైతికంగా ఏ మేరకు సబబు అన్నది కూడా చూస్తారు. అంతే కాదు ప్రజా కోణం కూడా ఆలోచిస్తారు. ఆ విధంగా చూస్తే గెజిట్ నోటిఫికేషన్ చట్టబద్ధత రక్షణ వంటి వాటి కంటే ఇవే అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పక తప్పదు. ఆ విధంగా ఆలోచిస్తే తరచూ ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధానుల మార్పు అన్నది చేయడం నైతికత అనిపించుకోదు, ఈ సూత్రం కట్టి పడేస్తుంది. అంతే కాదు ప్రజలు కూడా దీని మీద విసిగిపోతారు, ఆగ్రహోదగ్రులు అవుతారు. పైగా ప్రజలకు రాజధాని అన్నది ఒక సెంటిమెంట్. ఆల్ రెడీ అది అమరావతి రూపంలో ఉంటే దానిని మళ్ళీ తీసేందుకు మార్చేందుకు అయితే ప్రజలు అయితే ఒప్పుకోరు, ఆ విధంగా ప్రజా కోణం నుంచి ఆలోచించినపుడు బలంగా వారి మనోభావాలే ఎమోషన్ గా మారి అడ్డుకట్ట వేస్తాయని అంటున్నారు. మొత్తంగా విశ్లేషించినపుడు ఈ చట్టబద్ధత అన్నది జనంలో ఎమోషన్ గా మారి చివరికి అదే అమరావతికి అసలైన రక్షణ కవచంగా ఉంటుందని అంటున్నారు.
