అమరావతికి కేంద్రం మరో వరం.. పనులు చకచకా!
వాస్తవానికి ప్రభుత్వ ఆలోచన వేరేగా ఉంది. స్థానికంగా అందుబాటులో ఉన్న బంకులకు వచ్చే పెట్రోలు, డీజిల్‌ను బల్క్ మొత్తం లో కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కారు ఆలోచించింది.
By: Garuda Media | 29 April 2026 12:50 PM ISTఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణాన్ని వడివడిగా ముందుకు తీసుకువెళ్తున్న రాజధాని అమరావతి విషయం లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ పనులకు వినియోగించే ప్రొక్లేన్లు, బుల్ డోజర్లు, ఇతర మోటా రు ఆధారిత నిర్మాణ సామగ్రికి అవసరమైన.. పెట్రోలు, డీజిల్ విషయంలో ప్రభుత్వానికి స్వేచ్ఛ కల్పించింది. నేరుగా చమురు కంపెనీల నుంచి అవసరమైనంత మేరకు పెట్రోలు, డీజిల్‌ను కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వేలాది లీటర్ల పెట్రోలు, డిజిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయిల్ కంపెనీల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం లభించింది.
ప్రభుత్వ ఆలోచన ఇదీ..
వాస్తవానికి ప్రభుత్వ ఆలోచన వేరేగా ఉంది. స్థానికంగా అందుబాటులో ఉన్న బంకులకు వచ్చే పెట్రోలు, డీజిల్‌ను బల్క్ మొత్తం లో కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కారు ఆలోచించింది. తద్వారా.. అవసరమైనప్పుడు వెంటనే బంకుల నుంచి భారీ మొత్తంలో చమురును తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించింది. తొలుత ఈ ప్రతిపాదననే కేంద్రానికి పంపించింది. అమరావతి ప్రాంతంలో 4 పెట్రోలు బంకులు ఉన్నాయని.. వాటి నుంచి బల్క్ మొత్తంలో పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తామని కేంద్ర పెట్రొలి యం శాఖకు లేఖ రాశారు. అయితే.. దీనికి కేంద్రం సమ్మతించలేదు.
బల్క్ కొనుగోళ్లకు.. రిటైల్ ఔట్‌లెట్లకు సంబంధం ఉండదని.. నిబంధనలు కూడా అంగీకరించవని స్పష్టం చేసిన కేంద్రం.. రిటైల్ కేంద్రాల నుంచి కేవలం ప్రజలు, వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తారని తెలిపింది. ప్రభుత్వ అవసరాలకు.. ప్రైవేటు సంస్థల నిర్మాణాలకు.. అవసరమైన పెట్రోల్, డీజిల్‌ను నిబంధనల మేరకు ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో హెచ్‌పీ సీఎల్(హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్), బీపీసీఎల్(భారత్ పెట్రోలియం కార్పొరేషన్) సహా.. ఇతర కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నోట్ పంపించింది.
పనులు వడివడి..
కేంద్రం ఇచ్చిన సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకింత వెసులుబాటు కలగనుంది. నేరుగా కంపెనీల నుంచి చమురును కొనుగో లు చేయడం ద్వారా.. రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు.. రిటైల్ వ్యాపారుల కమీషన్లు కూడా తగ్గనున్నాయి. అంతేకాదు.. ఎప్పుడు కావాలన్నా.. ఇండెంట్ పెట్టగానే 24 గంటల్లో ఇంధనాన్ని సరఫరా చేసేందుకు వీలుగా కేంద్రం సహకరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన.. ఇంధనం సమస్య సమసిపోతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో పనులు వేగంగా చేపట్టేందుకు.. పూర్తిచేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం.. రోజుకు 500 నుంచి 800 లీటర్ల పెట్రోలు, డీజిల్ అమరావతి పనులకు వినియోగిస్తున్నారు.
