అమరావతిలో వరద నీళ్లు.. అసలు నిజం ఏంటో చెప్పిన మంత్రి నారాయణ
రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగు ప్రవాహాన్ని మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాల్సివుంది.
By: Tupaki Desk | 22 Aug 2025 3:21 PM ISTఏపీ రాజధాని అమరావతిలో వరద ముంపుపై గత కొన్నిరోజులుగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ చార్జి అంబటి మురళితోపాటు ఆ పార్టీ అనుబంధ పత్రికలు, టీవీ చానళ్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. అయితే తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని మరోవైపు వైసీపీ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో వరద ముంపు అంటూ దుష్ర్పచారం చేస్తున్న వారిపై మున్సిపల్ మంత్రి నారాయణ మండిపడ్డారు. శుక్రవారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండానే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగు ప్రవాహాన్ని మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాల్సివుంది. అయితే ఆ ప్రాంతం పూర్తిగా మట్టితో నిండిపోవడంతో వరద ప్రవాహానికి ఆటంకం కలిగిందని మంత్రి నారాయణ వివరించారు. దీనివల్ల కొండవీటి వాగు నీళ్లు వెనక్కి తన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయం అధికారుల దృష్టికి రాగానే రోడ్డుకు గండికొట్టి కొండవీటి వాగు ప్రవాహానికి దారి చూపారని మంత్రి వెల్లడించారు.
‘‘నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ టెక్నాలజీతో డిజైన్ చేస్తున్నారు. రాజధాని పనులు జరుగుతుండటంతోనే నీరు వచ్చింది. ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీసుకు వెళ్లేందుకు వాగు మీద రోడ్డు వేశారు. వర్షాలకు ముందు ఈ మట్టి తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదు. రోడ్డుకు గండి కొట్టిన 24 గంటల్లోనే మొత్తం నీళ్లు వెళ్లిపోయాయి. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలే ఛీకొడతారు’’ అంటూ మాంత్రి నారాయణ ప్రతిపక్షాలను హెచ్చరించారు.
కాగా, అమరావతి వరదల్లో మునిగిపోయిందని, కొండవీటి వాగు నీటిని గుంటూరు చానల్ కు మళ్లించడం వల్ల పొన్నూరు మునిగిపోతుందని కొద్దిరోజుల క్రితం వైసీపీ, ఆ పార్టీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఒకవైపు కేసులు నమోదుకు ఆదేశించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయంపైనా ఫోకస్ చేసిందని అంటున్నారు. వర్షాల వల్ల రాజధాని పనులకు కొంత అవాంతరం ఏర్పడినప్పటికీ, తగ్గుముఖం పట్టిన తర్వాత యథావిధిగా పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. మూడు రాజధానుల పేరిట వైసీపీ అమరావతిని నాశనం చేయాలని చూసినా, ప్రజలు కాపాడుకున్నారని చెబుతున్న టీడీపీ.. రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామంటోంది.
వైసీపీ ఎంతలా ప్రచారం చేసినా అమరావతికి వరద ముప్పులేదని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. రాజధాని ప్రాంతంలోని కొండవీటి వాగు, బండి వాగును మరింతగా విస్తరించి భవిష్యత్తులోనూ వరద ముంపు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెబుతున్నారు. బండి వాగు, కొండవీటి వాగు కృష్ణానదిలో కలుస్తాయి.
