దేశంలోనే అమరావతి ఫస్ట్ క్వాంటం వ్యాలీ: చంద్రబాబు
దేశంలోనే ఫస్ట్ క్వాంటం వ్యాలీ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
By: Garuda Media | 31 March 2026 11:33 PM ISTదేశంలోనే ఫస్ట్ క్వాంటం వ్యాలీ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పడుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. జాతీయ క్వాంటం మిషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాదిన్నర అయిందని.. అయితే.. ఇప్పటి వరకు ఏపీ మాత్రమే ఈ మిషన్‌ను అందిపుచ్చుకుందని తెలిపారు. తద్వారా ఏపీ క్వాంటం మిషన్‌ను అందిపుచ్చుకుని అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం `అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టం`పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
1997-2004 మధ్య ఐటీని ప్రోత్సహించామన్న చంద్రబాబు.. ఇప్పుడు `క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ`ని ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. ఐటీలో ఇది అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామన్నారు. ఐటీలో నిపుణులను తయారు చేయడానికి విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలు దీనికి సహకరించాలన్నారు.. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు.. ఐటీ కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. గతంలో వేగవతంమైన టెక్నాలజీ కోసం `బ్యాండ్ విడ్త్` లాంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని చెప్పారు.
జాతీయస్థాయిలో ఈ విధానాలను తీసుకువచ్చేలా చేసింది తానేనని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు చెప్పారు. అప్పట్లో చేసిన విజన్ ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని వివరించారు. ఐటీతో పాటు ఔషధ రంగాన్ని కూడా ప్రోత్సహించామన్నారు. ఈ క్రమంలోనే `జీనోమ్` వ్యాలీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. కరోనా వంటి సంక్షోభం తలెత్తినప్పుడు.. వంద దేశాలకు ఈ వ్యాలీలో ఉత్పత్తి అయిన వ్యాక్సీన్ ను ఉచితంగా సరఫరా చేశామని.. ఇది దేశం గర్వించదగ్గ కార్యక్రమం అని పేర్కొన్నారు.
గేమ్ ఛేంజర్!
గ్రీన్, క్లీన్ ఎనర్జీ విషయంలో ఏపీ గేమ్ ఛేంజర్‌గా మారనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులు కీలకంగా మారాయన్నారు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి ఖరీదైందని.. ప్రజలపై భారాలుపడుతున్నాయని.. ఈ నేపథ్యంలో మైక్రో గ్రిడ్స్ ద్వారా గ్రీన్, క్లీన్ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం అవసరమైన ప్రక్రియగా మారిందన్నారు. డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామన్నారు. స్పేస్ టెక్నాలజీ, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
